రెండేళ్లుగా ఫోన్ ట్యాప్.. చంపేందుకు భారీ కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనం

by Hajipasha |   ( Updated:2023-01-31 13:11:27.0  )
రెండేళ్లుగా ఫోన్ ట్యాప్.. చంపేందుకు భారీ కుట్ర చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను విధులకు దూరం చేస్తారా? సెక్యూరిటీని తగ్గించి ప్రాణాలు తీసేందుకు కుట్రలు చేస్తారా?' అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనపై గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఆనం రామనారాయణరెడ్డి పలు సందర్భాల్లో బరస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ప్రభుత్వం ఆనంను పక్కన పెట్టేసింది.

అంతేకాదు సెక్యూరిటీని కూడా తగ్గించేసింది. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి తన అనుచరులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆరోపించారు. తనను భౌతికంగా లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని తన బిడ్డలతో మాట్లాడాలంటే కేవలం వాట్సాప్ కాల్స్‌తోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఆరు నెలల్లో అందరి జాతకం తిరగబడుతుంది. నా ఫోన్ రెండేళ్ళుగా ట్యాప్ చేస్తున్నారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అధికార పార్టీ దుర్మార్గమే ఇదంతా అంటూ ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగేతర శక్తుల అధికారం చెలాయించడం సరికాదు..

వైసీపీ అసంతృప్త నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఉందని, రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరి కాదని హితవు పలికారు. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులను రాజ్యాంగ విధుల నుంచి దూరం చేయడం సరికాదన్నారు. అధికారులతో రాజకీయాలు చేయిస్తారా అంటూ మండిపడ్డారు.

రాజ్యాంగేతర శక్తుల ద్వారా అధికారుల బదిలీలు జరుగుతున్నాయని.. స్థానిక సంస్థల సమావేశాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారికి మాత్రమే ఆహ్వానం ఉండాలి అని చెప్పుకొచ్చారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే డా.బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవిలో పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజ్యాంగేతర శక్తులను పెట్టి అధికారులను బదిలీ చేసి పాలన కొనసాగిస్తామంటే ఎలా అని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు.

నాకు ప్రాణహాని ఉంది..

తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రాణహని ఉందని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో తన అనుచరులతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. తనకు సెక్యూరిటీని కూడ తగ్గించారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు నక్సల్స్ నుంచి త్రెట్ ఉన్నా సెక్యూరిటీ తగ్గించారని ఆరోపించారు. తనకు నక్సల్స్ నుంచి థ్రెడ్ ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ డీజీపీకి చెప్పిందన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తీసేస్తారా? అని ప్రశ్నించారు.

అంతేకాదు ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని.. స్మగ్లర్లు, వారికి సహకరించే వారు ఇక్కడ ఉన్నారని, అలాంటి చోట తిరిగే నాకు రక్షణ ఉంటుందా? అంటూ ప్రశ్నించారు. తనని రాజకీయంగా ఎదుర్కోలేక చంపేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. వేధింపులు, సాధింపులు తనకు కొత్తేమీకాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాజకీయంగా.. కుటుంబ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అంతా చూస్తున్నాం..ఆలోచించి స్పందిస్తానని ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

రెండేళ్ల నుంచి నా ఫోన్ ట్యాపింగ్..

గత రెండేళ్లుగా ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. తనతోపాటు తన పీఏ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయనకు రెండు ఫోన్లు ఉన్నాయని, గన్ మెన్ కి, పిఏ ఫోన్ లు ఉన్నాయని, తన ఫోన్, పిఏ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా మా ఫోన్లు ట్యాప్ చేశారని అన్నారు. ఫోన్ టాప్ చేయడం వల్ల వాట్సాప్, ఫేస్ టైమ్ యాప్‌లలో మాట్లాడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తన బిడ్డలతో కూడా ఇలానే మాట్లాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టాప్ చేసేదే మా వాళ్ళు, ఇంకా నేనెవ్వరికి ఫిర్యాదు చేయాలని నిట్టూర్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ను ట్యాప్ చేయించడం వంటి పోకడలు ఎన్నడూ లేవని, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలు తన రాజకీయ జీవితం ఆధారపడి లేదని అన్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు. సీబీఐ కేసుల్లో తాను హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతుందని తాను వ్యాఖ్యలు చేసిన రోజు నుండి తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు.

మూడో ప్రత్యామ్నాయం ఉంటే బాగుండేది..

వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఈలోగా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలంటూ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీకి బలమైన నియోజకవర్గం అని చెప్పుకొచ్చారు. అలాంటి నియోజకవర్గంలో కుమ్ములాటలు మెుదలయ్యాయయని వైసీపీ మూడు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో జగన్‌కు భారీ మెజారిటీ ఇచ్చారని అయితే ప్రస్తుతం వైసీపీ పాలనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నాలుగేళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ప్రభుత్వ తీరుపై అద్దం పడుతోందని విమర్శించారు. గతంలో టీడీపీ పాలన ప్రస్తుత వైసీపీ పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని మూడో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని మేధావులు, విజ్ఞులు,రాజకీయ విశ్లేషకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మూడో ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చారు. మరో ఆరు నెలల్లో అందరి జాతకం తిరగబడుతుందంటూ మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే పక్కను పెట్టేసిన వైసీపీ..

ఇకపోతే గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఆనం తీరుతో ఆగ్రహానికి గురైన అధిష్టానం చర్యలు తీసుకుంది. వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుండి తప్పించి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డికి అప్పగించింది. అంతేకాదు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పాల్గొనవద్దని కూడా వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed