ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

by Satheesh |   ( Updated:2024-02-21 14:14:36.0  )
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ చీఫ్, సీఎం జగన్ పూర్తిగా గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైపోయారు. ప్రజాక్షేత్రంలో వ్యతిరేక ఉన్న అభ్యర్థులను మారుస్తూ రెండోసారి గెలుపే టార్గెట్‌గా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు ఇప్పటికే జనసేనతో పొత్తు ఉన్న టీడీపీ.. తాజాగా బీజేపీతో కూడా పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పొత్తులపై చర్చించేందుకు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పొత్తు, సీట్ల సర్దుబాటుపై బీజేపీ హైకమాండ్‌తో ఆయన చర్చలు జరిపారు.

బీజేపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యి దాదాపు 15 రోజులు దాటిన పొత్తులపై మాత్రమ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు కమలనాథుల్లో గందరగోళం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా .. ఉండదా అని కేడర్ సందిగ్ధంలో పడిపోయారు. ఈ తరుణంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. బుధవారం పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నేతలతో భేటీ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కోసం చాలా కృషి చేశానని.. దండం పెట్టి మరీ మూడు పార్టీల పొత్తుకు ఒప్పించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలయెన్స్ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి ఎన్ని చివాట్లు తిన్నానో నాకే తెలుసని అన్నారు. వాళ్లను ఒప్పించడానికి నానా మాటలు పడ్డానని తెలిపారు.

అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం అన్నీ భరించానని జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీలను ఏ శక్తి ఆపలేదన్నారు. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ దీమా వ్యక్తం చేశారు. జగన్‌ సిద్ధం అంటే.. మేం యుద్ధం అంటామని తేల్చి చెప్పారు. కాగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు విషయంపై ఇవాళ్టి వరకు గందరగోళం నెలకొంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేక టీడీపీ, జనసేననే కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయా అని అయోమయం నెలకొంది. ఈ క్రమంలో మూడు పార్టీల పొత్తుపై పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వర్సెస్ జగన్‌గా ఎన్నికల పోరు సాగనుంది.

Read more..

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి

Advertisement

Next Story

Most Viewed