ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలకు ఆదేశించండి: ఏపీ హైకోర్టులో పిటిషన్

by Seetharam |   ( Updated:2023-11-01 11:12:18.0  )
ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలకు ఆదేశించండి: ఏపీ హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్చలకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహరించారని పిటిషనర్ ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ ఫిర్యాదులో ఆరోపించారు.ప్రెస్‌మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ సత్యనారాయణ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తులో ఉండగానే ప్రజాధనం ధుర్వినియోగం చేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని కోర్టులో వాదనలు వినిపించారు. చార్జి షీట్ దాఖలు చేయకుండా..విచారణ ముగియక ముందే ఇలా చేయటం ప్రజా ధనం వృధా చేసినట్లేనని వాదించారు. ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని న్యాయస్థానం కోరింది. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వడంలేదని న్యాయవాది వాదించారు. కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాల కోసం దరఖాస్తు చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలకు గవర్నర్ ఆదేశం

స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు ప్రెస్‌మీట్లు పెట్టిన అంశంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఇరువురుపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని గవర్నర్ అబ్ధుల్ నజీర్ లేఖ రాశారు. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం తదుపరి పరిణామాలపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలో కూడా ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రభుత్వ అధికారులుగా కొనసాగుతున్న వీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేశారంటూ సత్యనారాయణతోపాటు టీడీపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ప్రతినిధులుగా కొనసాగుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై పక్షపాత దోరణితో వ్యవహరించారని ఆరోపించారు. లా ఆండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించేలా సీఐడీ చీఫ్ సంజయ్‌,ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిరివురు వైసీపీ కార్యకర్తల్లా ప్రెస్‌మీట్‌లో వ్యవహరించారని.. నేరం చేశారని నిర్ధారణ కాకుండానే చంద్రబాబు నాయుడు నేరం చేశారని పదేపదే ఆరోపించారని సత్యనారాయణ గవర్నర్‌కు రాసిన ఫిర్యాదులో ఆరోపించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీఐ కాంపైన్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ ఫిర్యాదుపై గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ స్పందించారు. సీఐడీ చీఫ్, ఏఏజి తీరుపై ఎంక్వయిరీ చేయాలని,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story