Raging : NCC బ్యాచ్ వికృత క్రీడ.. జూనియర్ల పిరుదులపై కర్రలతో చితకబాది ఆ తర్వాత..

by Aamani |
Raging : NCC బ్యాచ్ వికృత క్రీడ.. జూనియర్ల పిరుదులపై కర్రలతో చితకబాది ఆ తర్వాత..
X

దిశ,వెబ్‌డెస్క్: ర్యాగింగ్‌ నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు, ఎన్నో నిబంధనలను అమలులో తెచ్చింది. అయినా ర్యాగింగ్ భూతం ఆగటం లేదు. తరచూ ఏదో ఒక చోట ర్యాగింగ్ పురివిప్పుతూనే ఉంది. సీనియర్లు చేసి వెకిలి చేష్టల వల్ల జూనియర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ (శ్రీ సుబ్బరాయ, నారాయణ) ఎయిడెడ్ డిగ్రీ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ ఆగడాలు వెలుగుచూశాయి. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..

కళాశాలకు చెందిన జూనియర్ విద్యార్థులను సీనియర్లు కర్రలతో కొడుతున్నట్లున్న వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అయింది. విద్యార్థుల ఒంటిపై, పిరుదులపై విచక్షణ రహితంగా కర్రలతో చితకబాదిన దృశ్యాలు కలకలం రేపాయి. ఆ వీడియోలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై నరసరావుపేట పట్టణ, గ్రామీణ సీఐలను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో ఆ ఘటన ఫిబ్రవరిలో జరిగిందని తేల్చారు. వీడియో ఒళ్లు గగుర్పోడిచేలా ఉన్నది. NCC బ్యాచ్‌కు చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్లను రూంలో బంధించి పిరుదులపై చితకబాదుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘోర ఘటనకు వార్డన్ సహకరిస్తున్నాడని తెలిసినా ప్రిన్సిపల్ ఎవరిపై చర్యలు తీసుకోకుండా సైలెంట్‌గా ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

వీడియో ఎలా బయటపడిందంటే..

కాగా, ఈ కళాశాలలో NCC ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని శ్రీ సుబ్బరాయ, నారాయణ కాలేజీలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. దాచేపల్లికి చెందిన ఓ తండ్రి తన కుమారుడిని ఆ కాలేజీలో చేర్పించాలని అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా ఆ విద్యార్థి ఈ వీడియోను తండ్రికి చూపించాడు. ఆ కళాశాలలో ర్యాగింగ్ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఈ వికృత క్రీడా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కళాశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లు, రాత్రివేళల్లో నిఘా పెట్టాల్సిన బృందాలు పనిచేస్తున్నాయా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed