నిధుల కొరతతో వెలవెలబోతున్న మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌లు

by Mahesh |
నిధుల కొరతతో వెలవెలబోతున్న మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌లు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జడ్పీలు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకే పరిమితమయ్యాయి. కేంద్రం నుంచి వచ్చే అరకొర నిధులతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. నిధులు లేక జిల్లా పరిషత్‌ల వ్యవస్థ నిర్వీర్యమైన దుస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయింపులపై దృష్టి సారించకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. గతంలో జడ్పీలకు కేంద్రం ఈజీఎస్‌, బీఆర్‌జీఎఫ్‌, ఆర్థిక సంఘం నిధులు కేటాయింపులు జరిపేది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ, జనరల్‌ఫండ్‌, ఆర్‌ఆర్‌ఎం తదితర పథకాల కింద నిధులు మంజూరు చేసేది. రాష్ట్ర ప్రభుత్వం జడ్పీలకు ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో జిల్లా పరిషత్‌లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జిల్లా పరిషత్‌ల్లో పాలనాపరమైన ఖర్చులకు సైతం నిధులు లేక సతమతం అవుతున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ (రంగారెడ్డి, మేడ్చల్‌ మాల్కాజిగిరి, వికారాబాద్‌) గా విభజించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో 27 మండల పరిషత్‌లు, వికారాబాద్‌ జిల్లాలో 19 మండల పరిషత్‌లు ఉన్నాయి. జడ్పీల విభజన అనంతరం 2019 జూలై 5న నూతన పాలకవర్గాలు కొలువుతీరాయి. ఉమ్మడి జడ్పీలో నిల్వ ఉన్న మొత్తానికి ప్రతి జడ్పీకి రూ.కోటి చొప్పున అందించారు. ఆపై ఏడాదిన్నరలో ప్రతీ జిల్లాపరిషత్‌కు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షల చొప్పున కేటాయించారు. మొత్తంగా ఏడాదిన్నారలో కాలంలో ప్రతి జడ్పీకి కేవలం రూ..1.80కోట్లు మాత్రమే నిధులు మంజూరు చేశారు. కోటి నిధులు నుంచి ప్రతీ జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు దాదాపు 30 నుంచి 40 శాతం తీసుకుని మిగతా అరకొర నిధులు జడ్పీటీసీ సభ్యులకు అందించినట్లు తెలిసింది. ఈ నిధులతో జడ్పీటీసీ సభ్యులు వారి ప్రాంతాల్లో చిన్నాచితక పనులు సైతం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక జడ్పీటీసీకి 15 నుంచి 25 పైగానే గ్రామాలు ఉంటాయి. పదిపదిహేను లక్షలతో కిలోమీటర్‌ డ్రెయినేజీ పనులు కూడా చేయలేక ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది.

కేంద్రానివి అరకొర నిధులే..

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల, జిల్లా పరిషత్‌ లకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో కేవలం కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో కాలం వెళ్లదీస్తన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. కనీసం చిన్న చిన్న అభివృద్ధి పనులు సైతం చేయించలేని పరిస్థితిలో జడ్పీలు ఉన్నారని అధికారులు వాపోతున్నారు. అరకొర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లెవరూ ముందుకు రాకపోవడం తో ప్రస్తుతం జడ్పీ నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేక పోతున్నామని అధికారులు తెలుపుతున్నారు. కనీసం అఫీసు ఖర్చులకు సైతం డబ్బులు లేని పరిస్థితిలో జడ్పీల వ్యవస్థ కొనసాగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed