గాలం చెరువుకు గాలం.. యథేచ్చగా కబ్జాకు యత్నం..

by Sumithra |
గాలం చెరువుకు గాలం.. యథేచ్చగా కబ్జాకు యత్నం..
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సుమారు 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో గల గాలం చెరువుకు గత ఏడాది నుండి కబ్జా చేయడానికి కన్నం వేస్తున్నారు. గాలం చెరువులోకి గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ శివారులో గల సింగ సముద్రం నుండి అక్కడి నుండి రాచర్ల బొప్పపూర్ శివారులో గల జక్కుల చెరువు నింపుకుని అక్కడి నుండి రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో గల గాలం చెరువులోకి సాగు నీరు వచ్చి చేరుతుంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గాలం చెరువును చుట్టుపక్కల గల రైతులు కొంత మంది అందినకాడికి ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయ మడులుగా అచ్చు కట్టుకుని తమ సొంత పట్టా పొలాలుగా తలచుకుని వ్యవసాయం చేస్తున్నారని పలువురు రైతులు దిశకు తెలిపారు. ఇప్పటికే గాలం చెరువు సుమారు ఆరు ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని ఆరోపణలు వినవస్తున్నాయి. గాలం చెరువు పక్కన గల ఓ రైతు గత 10 రోజుల నుంచి గాలం చెరువును ఆనుకుని ఎకరం నర పొలం అచ్చు కట్టడానికి చెరువు నుండి కబ్జా చేయడానికి ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ లతో అచ్చు కడుతుండగా చుట్టుపక్కల గల రైతులు ట్రాక్టర్లను అడ్డుకుని అచ్చుకడుతున్న రైతును నిలదీశారు.

సదరు రైతుకు ఇప్పుడు అచ్చుకడుతున్న మడులకు ఆనుకుని రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. దీనిని కలుపుకుని మూడు ఎకరాల మేర భూమి సాగు చేయాలని చూస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ రైతు గాలం చెరువును కొంతమేర కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడానికి వినియోగించిన ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ లను సీజ్ చేస్తే భవిష్యత్తులో ఏ ఒక్క రైతు కూడా మళ్ళీ చెరువు కబ్జాకు తెరలేపడని, చెరువును కాపాడడం కోసం మండల రెవెన్యూ అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని రాచర్ల గొల్లపల్లి రైతులు కోరుతున్నారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా ఇద్దరు రైతులు గాలం చెరువును కబ్జా చేసి వ్యవసాయం చేసుకోవాలని చూడగా రైతులు అడ్డుకున్నారు. చెరువు కబ్జా కాకుండా ఉండడం కోసం మండల తహశీల్దార్ బోయిని రాం చందర్ స్పందించి ల్యాండ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని ఇరిగేషన్ అధికారులు కూడా స్పందించి చెరువు కబ్జా కాకుండా చూడాలని దీనితో బోర్ బావులల్లో గల భూగర్భ జలాలు పైకి వచ్చి బోర్ బావుల ద్వారా నీరు సమృద్ధిగా వస్తుందని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed