Centre's election rule change: ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర- కేంద్రంపై ఖర్గే విమర్శలు

by Shamantha N |
Centres election rule change: ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర- కేంద్రంపై ఖర్గే విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నియమావాళిని సవరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Congress Chief Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. పోల్ డాక్యుమెంట్స్ పై నిషేధం, ఎన్నికల నియమాలను సవరించడంపై మండిపడ్డారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం (ECI) మార్పులు చేయడాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ‘‘ఎన్నికల కమిషన్‌ను(Election Commission) నాశనం చేయడానికి మోడీ ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్లను నియమించే సెలక్షన్ ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. ఇప్పుడు వారు చేసే కుట్రలు బయటకు రాకుండా ఉండేందుకు మార్పులు చేస్తున్నారు. ఓటర్ల పేర్లు తొలగింపు, ఈవీఎంలలో పారదర్శకత లేకపోవడం వంటి అక్రమాల గురించి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు బయటకు రాకుండా చేసేందుకు పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఇవన్నీ చూస్తుంటే ఈసీ తన స్వతంత్రతను కోల్పోతోందని స్పష్టమవుతోంది’’ అని ఖర్గే పేర్కొన్నారు. లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా చర్యలు చేపడుతోందని ఆరోపించారు. ఈ సవరణను న్యాయపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు

ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లో సవరణలు

ఇకపోతే, ఎన్నికల ప్రక్రియను మరింత గోప్యంగా మార్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతోపాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు(సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్‌ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్‌లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది. ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్‌ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్‌ ఆఫ్‌ ఎలక్షన్‌ రూల్స్‌–1961లోని రూల్‌ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బయటపెట్టాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్‌ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది.

Advertisement

Next Story