35శాతానికి పైగా పంట దెబ్బతింటనే పరిహారానికి అర్హులు: మంత్రి అంబటి రాంబాబు

by Seetharam |
35శాతానికి పైగా పంట దెబ్బతింటనే పరిహారానికి అర్హులు: మంత్రి అంబటి రాంబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మిచౌంగ్‌ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాను ప్రభావంతో రైతాంగం విలవిలలాడింది. పంటచేతికందివచ్చే సమయానికి తుఫాను రావడంతో రైతు సర్వం కోల్పోయాడు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు అన్నదాత. తుఫాను సృష్టించిన విధ్వంసంతో పంట నష్టపోయిన రైతన్న కంట కన్నీరు కారుస్తున్నారు. ఇకపోతే ఈ పంట నష్టంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నష్టం అంచనాల కమిటీ శనివారం నుంచి పర్యటిస్తుందని తెలిపారు. 35 శాతానికిపైగా పంట దెబ్బతిన్న రైతులే పరిహారానికి అర్హులంటూ కొత్త చిక్కుముడి పెట్టారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో కంటే రూ.2 వేలు అదనంగా నష్ట పరిహారం ఇస్తామని పేర్కొన్నారు. వరి, పత్తి, మిరప, శనగ, కూరగాయలు, అరటి, మామిడి పంటలకు, మూగ జీవాలకు నష్టం అంచనాలను వేయాలని అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. పంట నష్టం అంచనాల కమిటీ పర్యటనలో దగ్గర ఉండి పంటలను జాగ్రత్తగా నష్టం అంచనాలు వేయించు కోవాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed