పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ రాజకీయం: బొత్స

by Y. Venkata Narasimha Reddy |
పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ రాజకీయం: బొత్స
X

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై విష ప్రచారంతో డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. ఎంత మందికి తల్లికి వందనం ఇచ్చారని, ఎంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారని, మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకు తిరుమల లడ్డూపై వివాదం రేపారని బొత్స విమర్శించారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజమైన లెక్కలు మీరు చెప్పక పోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందిని చంపారో చెప్పండని డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నారని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డూ వివాదంలో విచారణ చేసి నిజాల నిగ్గు తేల్చాలని, ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సీబీలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి మహా ప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్దతి కాదన్నారు. దేవుడితో రాజకీయ ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని, దైవ ప్రసాదంపై చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, టీటీడీ ఈవో మాటలలకు మధ్య పొంతనలేదన్నారు. తిరుమల లడ్డూ విషయంపై విచారణ చేసి నిజాలు తేల్చి విచారణలో తప్పుచేసినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండని సూచించారు. దేవుని ప్రసాదంపై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని.. వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీపై బురదజల్లడం ఎంత వరకు న్యాయమన్నారు. మీ రాజకీయాల కోసం దేవుడిని బయటకు తీసుకువస్తారా?. కృష్ణారావు లాంటి వారు ప్రసాదంలో తప్పు జరగలేదని చెప్పారు. జరిగితే వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది నిరూపించ లేకపోతే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

Next Story

Most Viewed