Vijayawadaలో మహా మాయగాడు.. మహిళను నమ్మించి లక్షలు కొట్టేశాడు..!

by srinivas |   ( Updated:2022-11-25 15:36:07.0  )
Vijayawadaలో మహా మాయగాడు.. మహిళను నమ్మించి లక్షలు కొట్టేశాడు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్యాసినో వంటి విలాసాలకు అలవాటు పడ్డాడు. వేసిన షర్ట్ నలగకుండా..ఒళ్లు అలసిపోకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇప్పటికే కాంట్రాక్ట్ వర్కర్‌గా పని చేసినా అది వర్కౌట్ కాలేకపోవడంతో ఇక నకిలీ ప్రభుత్వ అధికారిగా అవతారమెత్తాలని భావించాడు. నకిలీ అవతారమైనా పోనీ చిన్నా, చితకో జాబు కాదు.. ఏకంగా సబ్ కలెక్టర్‌గా అవతారం ఎత్తాడు. నకిలీ ఐడీ కార్డు సృష్టించుకుని తన చేతికి, నోటికి పని చెప్పడం మెుదలు పెట్టాడు. ప్రజల అమాయకత్వాన్ని, ఆశలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోయాడు. ఒకరు కాదు ఇద్దరుకాదు పదుల సంఖ్యలో పలువురును మోసం చేశాడు. సుమారు 70 నుంచి 80 లక్షల వరకు వసూళ్లు చేశాడు. దొంగ దొరకనంత వరకే దొర. దొరికితే ఇక శ్రీకృష్ణజన్మస్థలంలోకి వెళ్లాల్సిందే. ప్రజలను మోసం చేసి వారిని నట్టేట ముంచిన ఈ కేటుగాడిని బాధిత మహిళ తెలివిగా రప్పించి కటకటాల వెనక్కి నెట్టింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వెలుగులోకి వచ్చింది.

సబ్ కలెక్టర్‌నంటూ పరిచయం

విజయవాడ చిట్టీనగర్‌కు చెందిన పిల్లా వెంకట రాజేంద్ర సీఆర్డీఏలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేశాడు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అప్పటికే క్యాసినో వంటి విలాసాలకు అలవాటు పడ్డ రాజేంద్ర ఇక చేసేది లేక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించి సెటిల్ అయిపోవాలని భావించాడు. అందుకు ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా సబ్‌ కలెక్టర్‌ అవతారమెత్తాడు. అందుకు సంబంధించి ఒక ఐడీ కార్డును సైతం రూపొందించాడు. ఐడీకార్డు మెడలో వేసుకుని ఇక బిల్డప్‌లు ఇవ్వడం మెుదలు పెట్టాడు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలలో తెలిసిన ఉన్నతాధికారులు ఉన్నారని ప్రజలను నమ్మించేవాడు. వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసేవాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేవాడు. ఎలాగోలా అతడి ఆచూకీ తెలుసుకుని వెళ్లి తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే పోలీసులు తనకు తెలుసు అని.. తననేమీ చేయలేరంటూ కేటుగాడు రాజేంద్ర వారిని భయపెట్టేవాడని తెలుస్తోంది. భూ సెటిల్‌ మెంట్లు చేసేవాడు. కలెక్టర్ అవుతానంటూ నమ్మించి మరీ వసూళ్లకు పాల్పడ్డాడు. అంతేకాదు జేపీ నడ్డా, శ్రీపతి నాయక్‌తో డైరెక్ట్‌ కనెక్షన్స్‌ ఉన్నాయంటూ ప్రజలను నమ్మించే బుట్టలో వేసుకునేవాడు. ఇందుకు సంబంధించి ఫోన్‌లో వారి పేర్లతో మెుబైల్ నంబర్స్ చూపించి వారిని నమ్మించి మోసం చేసేవాడు.

అయితే ఇటీవలే ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానంటూ ఓ మహిళ దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేశాడు రాజేంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లగా సబ్‌కలెక్టర్‌‌ హోదాలో పరిచయం చేసుకున్నారని బాధిత మహిళ తెలిపారు. ఏదైనా అవసరముంటే ఫోన్‌ చేయాలంటూ తమవద్ద ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారని చెప్పారు.. నెల తర్వాత ఫోన్ చేసి సివిల్‌ సప్లైయ్స్‌లో కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని అందుకుగానూ రూ.9 లక్షలు తీసుకున్నాడని వాపోయింది. ఎంతకీ కాంట్రాక్ట్‌ రాకపోయేసరికి ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశాడని విలపించింది. అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కోసం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని తన సోదరులను ఇంటికి పంపిస్తే అతని భార్య, అతని అత్త అత్యాచారం కేసు పెడతామని బెదిరించారని తెలిపింది.

పక్కా ప్లాన్ వేసి పట్టుకున్న బాధితురాలు

ఇక పక్కా ప్లాన్ ప్రకారం బాధిత మహిళ మోసగాడు రాజేంద్రకు ఫోన్ చేసింది. గన్నవరం రావాలని కోరింది. దీంతో రాజేంద్ర అక్కడికి వచ్చాడు. దీంతో కేటుగాడిని పట్టుకున్న బాధితురాలు డబ్బులు ఇవ్వాలని నిలదీసింది. డబ్బులు లేవు అని చెప్పాడు. మీరు కేసు పెట్టి నన్నేమి చేయలేరని బెదిరించారు. 9 మంది డీఎస్పీలు, సీఐలతోపాటు చాలా మందితో పరిచయాలు ఉన్నాయని, రెండు లక్షలు ఇచ్చి బయటకు వస్తాననిని బెదిరించాడు. అంతేకాదు అతడి ఫోన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు సైతం చూపించాడు. ఇంతలో బాధిత మహిళ ప్లాన్ ప్రకారం, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వారంతా కలిసి కేటుగాడు రాజేంద్రను పట్టుకున్నారు. అతడిని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. తనతోపాటు చాలా మంది అమాయకులను మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను కోరింది. అనంతరం నిందితుడి నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన నకిలీ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

READ MORE

చర్చనీయాంశమైనPawan kalyan బస్సుయాత్ర నినాదం?

Advertisement

Next Story

Most Viewed