Laxmi Parvathi: ఎన్టీఆర్ వారసుడు ఆయనేనంటూ కీలక వ్యాఖ్యలు

by srinivas |
Laxmi Parvathi: ఎన్టీఆర్ వారసుడు ఆయనేనంటూ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన వారసులు ఎవరో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగు సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ చివరి నిమిషం వరకు అండగా ఉంది దేవినేని నెహ్రూ ఒక్కడేనని గుర్తు చేశారు. దేవినేని నెహ్రూ ఒక్కడే ఎన్టీఆర్‌కు అసలు సిసలైన వారసుడు అని లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఇవాళ విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం సంతోషం కలిగిస్తోందని లక్ష్మీపార్వతి చెప్పారు.

విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు లక్ష్మీ పార్వతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు తామే వారసులమంటూ చాలా మంది డబ్బాలు కొట్టుకుంటున్నారని, కడుపున పుట్టినవాళ్లే వారసులు కారని అన్నారు. చివరకు మాట్లాడడం రాని నారా లోకేశ్ కూడా తానే ఎన్టీఆర్‌కు వారసుడినంటూ చెప్పుకుని తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. వీళ్లంతా ఎన్టీఆర్‌ను మోసం చేసిన దుర్మార్గులు అని వాళ్లెలా వారసులు అవుతారని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. కడవరకు అండగా నిలిచిన వారే వారసులంటూ లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనకు గురై మృతి చెందాడని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేసి అలసిపోయానని, అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని లక్ష్మీ పార్వతి వాపోయారు.

Advertisement

Next Story