వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

by Jakkula Mamatha |   ( Updated:2024-02-22 13:35:34.0  )
వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
X

దిశ, చంద్రగిరి: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతం తో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నాముకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఉదయం 11 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్‌ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More..

రాగి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి.. పట్టు వస్త్రాలతో ముస్తాబు చేసి..

Advertisement

Next Story

Most Viewed