మేనిఫెస్టోపై జనసేన ఫోకస్.. అమరావతిలో కీలక భేటీ

by srinivas |   ( Updated:2024-01-11 11:58:13.0  )
మేనిఫెస్టోపై జనసేన ఫోకస్.. అమరావతిలో కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ ఏపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే హామీలపై ఫోకస్ పెట్టింది. అంతేకాదు మేనిఫెస్టోను రూపొందించేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో అంశంపై ప్రతిపాదనలు తెలిపాలని సూచించారు. దీంతో అమరావతిలో గురువారం ఈ కమిటీ భేటీ అయింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మేనిఫెస్తో కమిటీ సభ్యులు గుత్తా శశిధర్, వరప్రసాద్, శరత్‌తో పలు అంశాలపై నాదెండ్ల చర్చించారు. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైనా చర్చించారు. ప్రజలకు నచ్చేలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గతంలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సభ్యులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేశారు. టీడీపీ 6 అంశాలను ప్రస్తావించగా.. జనసేన ఐదు అంశాలను ప్రతిపాదించింది. దీంతో 11 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో‌ను రూపొందిచాలని నిర్ణయించారు. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించి ఆ తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటిస్తామని నేతలు పేర్కొన్నారు.

అయితే తాజాగా జనసేన అంశాలను మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా జనసేన మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టో, జనసేన అంశాలపై చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. అంశాలపై తుది నిర్ణయాన్ని అధినేత పవన్‌కు వదిలేసినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed