‘పవర్‌స్టార్’ అనే కన్నా.. ప్రజల కోసం పనిచేసే కూలీ అనండి : పవన్ అసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
‘పవర్‌స్టార్’ అనే కన్నా.. ప్రజల కోసం పనిచేసే కూలీ అనండి : పవన్ అసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: బయట ‘పవర్‌స్టార్’ అని పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిక సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంలో తనను ప్రజల మనిషి అని అనుకోవడమే ఇష్టమని, ‘పవర్‌స్టార్’ అని పిలవడం తనకు ఎబ్బెట్టుగా ఉంటుందని అన్నారు. అందుకే తన కంట్రోల్‌లో ఉండే సినిమాల్లో కేవలం పవన్ కల్యాణ్ అనే సాధారణ టైటిల్స్ మాత్రమే ఉండేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. నాకు బిరుదులు ముఖ్యం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన వాడిని అని అన్నారు. తాను ఈ నేల, భారత‌దేశం కోసం పని చేస్తున్నాడని ప్రజలు అనుకుంటే చాలని.. అదే తనకు పెద్ద బిరుదని అన్నారు.

‘పవర్‌స్టార్’ అనే కన్నా.. ప్రజల కోసం పనిచేసే కూలీ అని అనుకుంటే తాను ఇంకా ఎక్కువగా సంతోషిస్తానని పేర్కొన్నారు. తనకు ఎలాంటి భయాలు లేవని, ఒకవేళ తప్పు చేస్తేనే భయపడతానని తెలిపారు. తనకు ఆశలు, పదవుల మీద యావ లేదని, ప్రజల వైపు నిలబడాలనే ఆంకాంక్ష తప్పా.. అడ్డదారుల్లో అధికారం సంపాదించాలని అనుకోలేదని అన్నారు. సీఎం జగన్ సిద్ధం.. సిద్ధం అంటూం రాష్ట్ర అంతటా పోస్టర్లు వేయించారని, ఆయన దేనికి సిద్ధమో చెప్పాలన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓట్లడిగేందుకు జగన్ వస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లో ఉంటే.. ఉంటాం, పోతే పోతాం అనుకున్నానని, చివరికి ఓ సత్యాన్ని ఆవిష్కరించి చచ్చిపోవాలనే నిర్ణయించుకున్నానని వపన్ అన్నారు.

Next Story

Most Viewed