మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : Governor బిశ్వభూష‌ణ హ‌రిచంద‌న్

by Nagaya |   ( Updated:2022-12-18 07:29:43.0  )
మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : Governor  బిశ్వభూష‌ణ హ‌రిచంద‌న్
X

దిశ, ఏపీ డైనమిక్ బ్యూరో : ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని ఏపీ గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌ణ హ‌రిచంద‌న్ ఆశాభావం వ్యక్తం చేశారు. మ‌రో ఐదేళ్లలో భార‌త్ ఆర్థిక వ్యవ‌స్థ 5 ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేరుకోవ‌డం ద్వారా భార‌త్ పూర్వ వైభ‌వం సంత‌రించుకోనుంద‌న్నారు. సెంచూరియ‌న్ విశ్వ విద్యాల‌యం ద్వితీయ స్నాత‌కోత్సవ వేడుక‌లకు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న వర్చ్యువల్ విధానంలో మాట్లాడారు. గ‌త ప‌దేళ్లలో విద్య, ఆర్థిక రంగాల‌లో భార‌త్ ముందుకు దూసుకుపోతుంద‌న్నారు. 18 శ‌తాబ్ధం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవ‌స్థలో భార‌త్ 25 శాతం సంప‌ద క‌లిగి ఉండ‌గా, స్వాతంత్రం వ‌చ్చేట‌ప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవ‌స్థలో ఒక శాతానికి దిగ‌జారింద‌న్నారు.

మ‌న ఆర్థిక వ్యవ‌స్థ తిరిగి రెండు ట్రిలియ‌న్ డాల‌ర్లను చేరుకోవ‌డానికి 70 ఏళ్లు ప‌ట్టగా, మూడో ట్రిలియ‌న్ డాల‌ర్లు చేరుకోవ‌డానికి మ‌రో ఐదేళ్లు ప‌ట్టింద‌న్నారు. రానున్న ఐదేళ్లలో మ‌న ఆర్థిక వ్యవ‌స్థ 5 ట్రలియ‌న్ డాల‌ర్లకు చేరుకుంటుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. అటువంటి ఆర్థిక వ్యవ‌స్థలో పాలుపంచుకోవ‌డానికి నైపుణ్యం క‌లిగిన విద్యార్థులు అవ‌స‌ర‌మ‌ని అందుకు సెంచూరియ‌న్ విశ్వవిద్యాల‌యం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు. దేశంలోనే నైపుణ్య విద్యను అందించ‌డంలో సెంచూరియ‌న్ మొద‌టి స్థానంలో ఉంద‌ని రానున్న కాలంలో నూత‌న విద్యా విధానం అందుకు మ‌రెంతగానో తోడ్పడ‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ‌హించిన‌ ఛాన్సల‌ర్ డాక్టర్ దేబి ప్రస‌న్న ప‌ట్టనాయ‌క్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏక‌త్వం క‌లిగిన అతి ప్రాచీన‌మైన భార‌త్ జి20 దేశాల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. ఆర్థిక వ్యవ‌స్థలో అవ‌క‌త‌వ‌క‌లు, సాంకేతిక‌త వినియోగం త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల స‌మాజంలో ఆర్థిక‌ అస‌మాన‌త‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్నారు. ఈ దుస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్నారు. 5జీ టెక్నాల‌జీ రాక‌తో ఈ అస‌మాన‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టవ‌చ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ స్థాయి నైపుణ్య విద్యను విద్యార్థుల‌కు అందించేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని సెంచూరియ‌న్ విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్సల‌ర్ ప్రొఫెస‌ర్ జీఎస్ఎన్ రాజు చెప్పారు. ఈ స్నాత‌కోత్సవంలో 149 మంది విద్యార్థుల‌కు డిగ్రీల‌ను ప్రధానం చేస్తున్నామ‌న్నారు. వ‌చ్చే ఏడాది ఎంబిఎ కోర్సులు ప్రవేశపెట్టనున్నామ‌న్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేద‌ల‌కు వివిధ రంగాల‌లో ఉచిత శిక్షణ‌, ధృవ‌ప‌త్రాల‌ను అంద‌జేస్తున్నట్టు వివ‌రించారు.

గౌర‌వ అతిధిగా పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ అద‌న‌పు కార్యద‌ర్శి ముదే సేవ‌ల నాయ‌క్ మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పధంతో ఉండాలన్నారు. 2030 నాటికీ భారత్ ఆర్థిక రంగం విస్తరించుకోనుందన్నారు. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు. వివిధ విభాగాల‌లో ప్రతిభ చూసిన ప‌ది మంది విద్యార్థుల‌కు ప‌ది బంగారు ప‌త‌కాల‌ను అతిధుల చేతుల మీదుగా అంద‌జేశారు. దాంతోపాటు ప్రోత్సాహ‌క బ‌హుమతి కింద రూ.10వేలు న‌గ‌దును అంద‌జేశారు. అనంత‌రం విద్యార్థుల‌కు అతిధుల చేతుల మీదుగా డిగ్రీల‌ను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల‌యం అధ్యక్షులు డాక్టర్ ముక్తికాంత్ మిశ్రా, ఉపాధ్యక్షులు ప్రొఫెస‌ర్ డిఎన్ రావు, ఒడిశా క్యాంప‌స్ వైస్ ఛాన్సల‌ర్ డాక్టర్ సుప్రియా ప‌ట్టనాయ‌క్, రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ పీఎస్వీ ర‌మ‌ణారావు, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.ఎస్.వ‌ర్మ, గ‌వ‌ర్నిగ్ బాడీ స‌భ్యులు, అకాడ‌మిక్ కౌన్సిల్ స‌భ్యులు, ప్రొఫెసర్ పద్మరాజు, ప్రొఫెసర్ మల్లికార్జున, పలువురు డీన్లు డాక్టర్ స‌న్నీడియోల్, డాక్టర్ ఎంఎల్ఎన్ ఆచార్యులు, ప‌లువురు విద్యార్థులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed