జిల్లాల పునర్విభజన.. అత్యధిక పీఎస్‌లు ఉండే జిల్లా ఇదే

by Rajesh |
జిల్లాల పునర్విభజన.. అత్యధిక పీఎస్‌లు ఉండే జిల్లా ఇదే
X

దిశ, రాయలసీమ: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఏప్రిల్2 (ఉగాది) నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించింది. అయితే తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లా ఒకటి. చిత్తూరు, నెల్లూరు నుంచి కొంత భాగం తీసుకుని బాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం నెల్లూరు జిల్లాలోనే ఉంచారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పోర్ట్ బాలాజీ జిల్లాలోకి వెళ్లకపోయినా ఆ జిల్లాకు అధిక ప్రాధాన్యమే దక్కిందని చెప్పాలి. ఆ జిల్లా ప్రాధాన్యత దృష్ట్యా అత్యధిక పోలీస్ స్టేషన్లు అక్కడే ఏర్పాటు కాబోతుండటం విశేషం.

54 పోలీస్ స్టేషన్లు బాలాజీ జిల్లాలోనే..

శ్రీ బాలాజీ జిల్లా పరిధిలో 54 పోలీసు స్టేషన్లు ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రాయలసీమ, సౌత్ కోస్టల్ జోన్లు కలవబోతున్నాయి. అదే తరహాలో ఉద్యోగుల విభజనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో 19 పోలీసు స్టేషన్లు ఉండగా దీనికి అదనంగా గూడూరు సబ్ డివిజన్‌లోని 19 పోలీస్ స్టేషన్‌లు, సత్యవేడు సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లు కలుస్తాయి. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక పోలీసు స్టేషన్లు ఉన్న జిల్లాగా బాలాజీ జిల్లా ఉండబోతోంది.

సబ్ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

శ్రీ బాలాజీ జిల్లాకు ఇప్పటికే తిరుపతిలో తాత్కాలిక కలెక్టరేట్‌ను ఖరారు చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా శాశ్వత కలెక్టరేట్ భవనాలు నిర్మించేందుకు అధికారులు తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట ప్రాంతాల్లో భూములు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పోలీసు శాఖలోనూ విభజన కసరత్తు ఇప్పటికే మొదలైంది. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. మరో మూడు కొత్త పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు, పశ్చిమ, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుమల సబ్ డివిజన్లు ఉన్నాయి. జిల్లా ఏర్పాటుతో గూడూరు సబ్ డివిజన్, శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం, తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీసిటీ సెజ్ దీని పరిధిలోకి వస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్తగా మూడు పోలీసు సబ్ డివిజన్లు చంద్రగిరి, సత్యవేడు, నాయుడుపేటల్లో ఏర్పాటు చేస్తే భద్రత పరంగా సమస్యలు ఉండవని ఉన్నతాధికారులు అంచనా వేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల అనంతరం జోనల్ బదిలీలు..

కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సూళ్లూరుపేట, గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలోని సర్కిల్ స్థాయి పోలీసు అధికారులను అక్కడికక్కడే మార్పులు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే వరకు శ్రీ బాలాజీ జిల్లా, తిరుపతి ఎస్పీ పరిధిలో పనిచేసినా సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల వారిని చంద్రగిరి, సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి పరిధిలో బదిలీ చేసే అవకాశం ఉండదు. దీనికి జోనల్ రిజర్వేషన్లు అడ్డుగా ఉంటాయి. జోన్ల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన తరువాత బాలాజీ జిల్లా పరిధిలో పూర్తిస్థాయి బదిలీలు ఉంటాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే అత్యధిక పోలీస్ స్టేషన్లు ఉండే జిల్లాగా బాలాజీ జిల్లా రికార్డుల కెక్కనుంది.

Next Story

Most Viewed