Amaravati R5 zone: ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే..!

by srinivas |   ( Updated:2023-05-17 10:22:30.0  )
Amaravati R5 zone: ఇళ్ల స్థలాలపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇవే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల కేటాయింపునపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపింది. చట్ట ప్రకారమే 5 శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని పేర్కొంది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 53.1డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

కాగా ఆర్‌5 జోన్‌ అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం అమరావతి రైతులు భూములిచ్చారని రైతుల తరఫు న్యాయవాది వాదించారు. ‘ఒక మహానగరం వస్తుందని హామీ ఇచ్చారని .. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపారు అని రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మారు. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా భూములిచ్చారు. ప్రభుత్వం మాట నమ్మి వేల ఎకరాలు ఇచ్చారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధిపై అధికారులు వెళ్లి ప్రచారం చేశారు. మాస్టర్‌ప్లాన్‌లో నవ నగరాలు ప్రతిపాదించారు. నవనగరాల అభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపురేఖలు మారతాయన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి 5 శాతం భూములివ్వాలి.

రెసిడెన్షియల్ జోన్ల నిబంధనల ప్రకారం కేటాయింపులుండాలి. నవనగరాల్లోని ప్రతి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉంది. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరు’ అని రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘కోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జూలైలో తుది విచారణ జరగాల్సి ఉంది. అంతకుముందే పట్టాలిస్తే ఇక చేయడానికి ఏం ఉంటుంది?’ అని రైతుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

పట్టాలు ఇవ్వొచ్చు

భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటకు వాదనలు ప్రారంభమయ్యాయి. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు అమరావతి రైతుల విజ్ఞప్తి మేరకు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కీలక మార్పులు చేసింది. ఇళ్ల స్థలాలు కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారులకు ఇచ్చే పట్టాలో కోర్టులో కేసు విచారణ పెండింగులో ఉన్న కారణంగా కేసు యొక్క తుది తీర్పుకి లోబడి లబ్ధిదారులకు హక్కు ఉంటుందని తెలిపింది. కేటాయింపులు అమ‌రావ‌తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబ‌డే ఉంటుంద‌న్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప‌ట్టాలు పంపిణీ చేసినా హ‌క్కుదారుల‌కు హ‌క్కులు కోర్టు తీర్పుకు లోబ‌డే ఉంటాయని స్పష్టం చేసింది. ల‌బ్ధిదారులు వేరే వాళ్లకు విక్రయించ‌కూడ‌దని పేర్కొంది. అమ‌రావ‌తి కేసులో వ‌చ్చే తుది తీర్పునకు లోబ‌డే ప‌ట్టాల పంపిణీ అమ‌లు అవుతుందని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్తర్వుల్లో ఈ మేర‌కు సుప్రీంకోర్టు సవరణలు చేసింది.

Also Read..

ఆర్5జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు

Advertisement

Next Story

Most Viewed