Ap Second Place: లెక్కల గుట్టు రట్టు చేసిన మాజీ మంత్రి.. మరీ ఇంత అధ్వాన్నమా..?

by srinivas |   ( Updated:2023-06-24 11:24:51.0  )
Ap Second Place: లెక్కల గుట్టు రట్టు చేసిన మాజీ మంత్రి.. మరీ ఇంత అధ్వాన్నమా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలకు నెలవుగా మార్చాడని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక అత్యాచారాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పడం బాధాకరమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోల్చిచూస్తే శాంతిభద్రతల నిర్వహణ ఈ ప్రభుత్వంలో ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని వెల్లడించారు. శనివారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పరిపాలన దోచుకోవడం దాచుకోవడానికే తప్ప, ప్రజల్ని కాపాడటానికి కాదని తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఐదు నిమిషాలకో అత్యాచారం, పది నిమిషాలకో అఘాయిత్యం, అరగంటకో హత్య జరుగుతున్నదని, ఈ కీచక పాలన దేనికోసం ఎవరికోసం జగన్మోహన్ రెడ్డి? అని నిలదీశారు.


గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అసాంఘిక కార్యకలాపాలతో పోలిస్తే, నేడు జగన్ జమానాలో జరిగే దారుణాలు, దుశ్చర్యల్లో రాష్ట్రం చాలా గొప్ప పురోగతి సాధించిందన్నారు. అత్యాచారాల్లో 30 శాతం, దాడుల్లో15 శాతం, ఆత్మగౌరవాన్ని అవమానించే సంఘటనలు 31 శాతంవరకు ఈ ప్రభుత్వంలో పెరిగాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు 52 వేల మంది మహిళలపై అఘాయిత్యాలు, ఇతరత్రా వేధింపులు జరిగాయన్నారు. 22,278 వరకు మిస్సింగ్ కేసులు నమోదైతే, 9 మంది యువతలు, బాలికలపై యాసిడ్ దాడులు జరిగాయని వెల్లడించారు. 32 మంది మహిళలు సామూహిక మానభంగాలకు గురయ్యారని, ఇన్ని దారుణాలు జరగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, పాలకులే అని ఆరోపించారు. జగన్ పరిపాలన కేవలం దోచుకోవడం దాచుకోవడానికే పరిమితమైంది తప్ప, ప్రజల్ని కాపాడేలా లేదని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లిని భయంతో పరాయి రాష్టానికి పారిపోయేలా చేసి, బాబాయ్‌ని చంపిన వారిని శిక్షించలేని ముఖ్యమంత్రి, ప్రజల్ని రక్షిస్తాడనుకోవడం మూర్ఖత్వమేనని విమర్శించారు. ప్రభుత్వం, పాలకులు ఇదేవిధంగా పేట్రేగితే ప్రజాబలం ముందు పలాయనంతో, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోక తప్పదని ఆలపాటి తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed