AP News:మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

by Jakkula Mamatha |
AP News:మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
X

దిశ, నందికొట్కూరు: మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.రంగ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.సోమన్న, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. సుబ్బారెడ్డిలతో కలిసి గడివేముల మండలం కొర్ర పోలూరు, మిడుతూరు మండలం రోళ్ల పాడు, నందికొట్కూరు పట్టణంలోని జీవన జ్యోతి పాఠశాల సమీపంలో, జూపాడుబంగ్లా , పాములపాడులో మొక్క జొన్న రైతులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో దాదాపు 1800 మంది రైతులు 40 వేల ఎకరాల్లో సాగు చేశారన్నారు. జిల్లాలోని నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె నియోజకవర్గ పరిధిలో రైతులు మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగు చేశారన్నారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చిన ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మార్కుఫెడ్ క్వింటాలు రూ.3300ల ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు మొక్కజొన్న రైతుల సమస్యలపై దృష్టి సారించాలని రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని మార్కుఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యల పై సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టామని ఈ కార్యక్రమానికి రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, రమేష్ బాబు, బాషా, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, చిన్నారాజు, దేవనూరు నాగరాజు, స్వాములు నాయుడు, షేక్షావలి, రామకృష్ణ, భాస్కర్ గౌడ్ , కొర్ర పోలూరు రైతు సంఘం నాయకులు ఇబ్రహీం, రసూల్, నబి సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed