Pakistan soldiers : పాక్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇరువైపులా ఆరుగురు మృతి

by vinod kumar |
Pakistan soldiers : పాక్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఇరువైపులా ఆరుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు పాక్ ఆర్మీ శనివారం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు వెల్లడించింది. ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యం మధ్య జరిగిన కాల్పుల్లో సైనికులు మరణించగా, అనంతరం స్పెషల్ ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపింది. మరణించిన టెర్రరిస్టుల్లో ఒకరు ఇటీవల విదేశీ రాయబారుల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు గుర్తించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి టీటీపీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, దీనిని తాలిబన్లు తిరస్కరించారు. కాగా, తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాకిస్థాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story