AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్

by Jakkula Mamatha |
AP News:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25" (Special Assistance to States for Capital Investment)ద్వారా తొలి విడతగా రూ.113.751 కోట్లు(66 శాతం) విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడత నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చు అని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదిక(డీపీఆర్) సమర్పించామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక ఆంధ్రప్రదేశ్ కు సహకరించిన ప్రధాని మోడీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై పర్యాటక శాఖ, దేవాదాయ, ఆర్ అండ్ బీ శాఖల మంత్రులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగిందని, అనంతరం ఢిల్లీలో డిప్యూటీ సీఎం పర్యటించి త్వరితగతిన నిధులు విడుదలకు చొరవ చూపించడంపై మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆచరణలో చేసి చూపిస్తామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed