KTR : దిలావర్ పూర్ లోనే కాదు...లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-27 11:44:13.0  )
KTR : దిలావర్ పూర్ లోనే కాదు...లగచర్లలో కూడా లెంపలేసుకోవాలి : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : దిలావర్ పూర్ రైతుల దెబ్బకు దిగివచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. వెంటనే లగచర్లలో అల్లుడి కోసం ఆదానీ కోసం ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో పెడుతున్న ఫార్మా, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని డిమాండ్ చేశారు. అమాయకులైన గిరిజనుల భూములను దొంగచాటుగా బలవంతంగా లాక్కునే కుట్రలకు ఇప్పటికైనా తెరదించాలని..అక్కడ శాంతిని నెలకొల్పాలన్నారు.

ఢిల్లీలో రైతుల సంఘటన శక్తిలో ఉన్న బలం ముందు దేశ ప్రధాని కూడా చివరికి వెనక్కి తగ్గిన చరిత్ర మన కళ్ళ ముందు ఉందని పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయాలతో మొన్న లగచర్లలో లడాయికి కారణమైన రేవంత్ రెడ్డి.. తన మొండి వైఖరి వల్లే నిన్న నిర్మల్ లో ఇథనాల్ మంటలను రాజేశారని కేటీఆర్ ఆరోపించారు. తలకు మాసిన ఆలోచనలతో రేపు రేవంత్ ఏ జిల్లాలోని.. ఏ పచ్చని పంట పొలాల్లో ఎలాంటి బాంబు పేలుస్తారోననే భయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరిలో వ్యక్తం అవుతుందని, ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవడం..

వారి మనోభావాలను గౌరవించడం అనేది పాలకుడి ప్రాథమిక విధి అని హితవు పలికారు. ఈ విషయాన్ని గుర్తెరిగి వెంటనే నిర్మల్ తరహాలోనే.. సొంత నియోజకవర్గంలో లగచర్ల సమరానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. తప్పు ఒప్పుకుని వెనక్కి తగ్గినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి కిరీటం ఏమీ పడిపోదని, లేకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed