Srisailam Reservoir:శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి వెంటనే ఆపండి

by Jakkula Mamatha |
Srisailam Reservoir:శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి వెంటనే ఆపండి
X

దిశ ప్రతినిధి, నంద్యాల: ప్రకృతి కనికరించిన, శ్రీశైలం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తున్న పాలకుల వైనంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్ళు వదులుతున్న అంశంపై బుధవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తాగు, సాగు నీటి రక్షణకు రూపొందించిన శ్రీశైలం రిజర్వాయర్ విధివిధానాలను వివరిస్తూ వందలాది టీఎంసీల నీళ్లు శ్రీశైలం దాటి దిగువకు వెళ్ళినప్పటికీ రాయలసీమలోని ప్రాజెక్టు ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించడంలో రాష్ట్ర జలవనరుల శాఖ విఫలమైందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు.

ఈ సంవత్సరంలో జూన్ మొదటి నుండి నేటి వరకు కృష్ణా, తుంగభద్ర నదుల పరవళ్ళతో 1532 టీఎంసీల నదీ జలాలు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరాయి అన్నారు. దాదాపు 100 రోజుల పాటు నిరంతర ప్రవాహం కొనసాగినప్పటికీ కృష్ణా, పెన్నా జలాల సంరక్షణలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తెలుగుగంగ, గాలేరు - నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు, నీటి వినియోగానికి రాష్ట్ర విభజన చట్టం అనుమతులు ఇచ్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ నేటికి కూడా ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీరు లభించడం లేదని ఇది జలవనరుల శాఖ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. సుమారు 885 టీ యం సిల కృష్ణా నదీ జలాలు సముద్ర గర్భంలో కలిసినప్పటికీ, లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక ప్రాంతాల్లో త్రాగునీరు లభించని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు, సాగునీరు అవసరాలు తీరిన తర్వాతనే విద్యుత్ శక్తి ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఈ విధి విధానాలలో ఏ ఒక్కటి కూడా అమలు పరచడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని విమర్శించారు. నీటి పారుదల ప్రయోజనాలను ఏ విధంగాను భంగం కలగకుండా విద్యుత్ ఉత్పత్తి చేయాలని, నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయించిన నీటి పరిమాణానికి లోబడే విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రాజెక్టు అనుమతులలో పొందుపరిచినప్పటికీ వాటిని కాలరాచి నీటిని దిగువకు తోడేయడం శోచనీయమన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు 150 టీ యం సి ల నీటిని నిల్వ చేసుకునే విధంగా శ్రీశైలం రిజర్వాయర్ లో 854 అడుగుల పైన 60 టీ యం సి ల నీటిని "క్యారీ ఓవర్" గా నిలువ వుంచాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొందనీ, ఏదైనా అవసరం కోసం విద్యుత్ ఉత్పత్తి చేసిన నాన్ పీక్ అవర్స్ లలో " రివర్సబుల్ అర్బైన్లు " ఉపయోగించి నీటిని తిరిగి శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఎత్తిపోసే వెసులుబాటు కూడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసారు.

కృష్ణా, తుంగభద్ర నదుల పై నిర్మించిన ప్రాజెక్టులు తుంగభద్ర డ్యాం, జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లు, ప్రకాశం బ్యారేజిలు అన్నీ జలకళతో ఉంటే కేవలం శ్రీశైలం రిజర్వాయర్ లో మాత్రం నీరు అడుగంటే పరిస్థితి దాపురిస్తోందనీ, ఈ అంశంపై దృష్టి సారించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు రాయలసీమ సమాజం భావిస్తోందన్నారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి, వాటి సంరక్షణకు చేపట్టాల్సిన కీలక అంశాలను దాటవేస్తూ గోదావరి కృష్ణా నదిని అనుసంధానం చేస్తే రాయలసీమలో ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని "ఏమార్చే" మాటలను విస్తృతంగా ప్రచారం చేయడం బాధాకరంగా ఉందన్నారు. పాలకుల అలక్ష్యం వలన వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక కరువు, వలసలతో సహజీవనం చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలుపుదల చేసి, శ్రీశైలం ప్రాజెక్టు విధివిధానాలను కఠినంగా అమలు చేసి శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటకుండా కాపాడి రాయలసీమ ప్రాంత తాగు, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా కాపాడాలని ప్రభుత్వానికి దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story