AP News:భారీ వర్షం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:పరిటాల శ్రీరామ్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-22 14:28:02.0  )
AP News:భారీ వర్షం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:పరిటాల శ్రీరామ్
X

దిశ ప్రతినిధి, ధర్మవరం: భారీ వర్షం కారణంగా ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టం జరిగిన ప్రాంతాల్లో శ్రీరామ్ పర్యటించారు. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి నగర్, దుర్గా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో శ్రీరామ్ పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ తో కలిసి వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల చెట్లు కూలి ఇళ్లపైన పడటంతో చాలా ఎక్కువ నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. మరోవైపు మగ్గం గుంతల్లోకి నీరు వచ్చి వేల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం మండలం ఓబులనాయునిపల్లి గ్రామానికి చెందిన రైతు కొల్లా ఆదెప్ప భూమిలో కరెంటు ట్రాన్స్ ఫార్మర్, స్తంభాలు రాత్రి కురిసిన వర్షానికి నేలకూలగా వాటిని పరిశీలించారు.

విద్యుత్ అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. నడిమిగడ్డపల్లి గ్రామానికి చెందిన రైతు అప్పానాయక్ కు సంబంధించిన దాదాపు 5 ఎకరాల్లోని ద్రాక్ష తోట, పంట కోసం ఉపయోగించే రాళ్లు మొత్తం పడిపోగా.. శ్రీరామ్ బాధిత రైతును పరామర్శించి 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ధైర్యంగా ఉండాలని నష్టపరిహారం గురించి ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అలాగే ధర్మవరం చెరువు భారీ వర్షాలకు మరువ పారుతుండటంతో.. అక్కడ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గంగ పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలకు ధర్మవరం చెరువు నిండడం సంతోషమే అయినప్పటికీ.. గత రాత్రి కురిసిన వర్షాలకు అపార నష్టం, ఆస్తి నష్టం వాటిలిందన్నారు.

ధర్మవరం రూరల్ ప్రాంతంతో పాటు ముదిగుబ్బ ప్రాంతంలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగిందన్నారు. ధర్మవరం పట్టణంలో చేనేతలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. ఇప్పటికే కమిషనర్ సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి నష్టాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఇంకా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు పరిచే సుధాకర్, చింతలపల్లి మహేష్ నాయుడు, భీమనేని విజయ సారథి, ప్రసాద్ నాయుడు, పురుషోత్తం గౌడ్, విజయ్ చౌదరి, సిగిజర్ల రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story