బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు హామీ

by Gantepaka Srikanth |
బీసీలకు ప్రాధాన్యత ఇస్తాం.. మంత్రి శ్రీధర్ బాబు హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పరిశ్రమల స్థాపనలో బీసీ యువతకు అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చేయూతనందించాలని ‘బిక్కి’ (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) చేసిన ప్రతిపాదనకు ఆ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. బీసీ పారిశ్రామిక విధానం, బీసీ ప్రొక్యూర్‌మెంట్ పాలసీల గురించి ‘బిక్కి’ ప్రతినిధులు మంత్రితో మంగళవారం సమావేశమై చర్చించారు. బీసీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సమస్యలు, వాటికి ప్రభుత్వం తరఫున లభించాల్సిన పరిష్కారం, అందాల్సిన సహాయ సహకారాల గురించి వీరి మధ్య చర్చలు జరిగాయి.

‘బిక్కి’ తరపున అధ్యక్షుడు చీరాల నారాయణ, సెక్రెటరీ డాక్టర్ దాసరి కిరణ, స్టేట్ కోఆర్డినేటర్ పరికిపండ్ల సుమంత్, మహేందర్ యాదవ్ తదితరులు మొత్తం 17 ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) పాలసీలో బీసీలకు తగిన న్యాయం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బీసీ కులాల్లోని యువ, మహిళా పారిశ్రామికవేత్తలకు వారి వ్యాపార అభివృద్ధికి, కొత్త పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేయడమే కాకుండా వారికి అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహిస్తుందని తెలిపారు.

‘బిక్కి’ చేసిన ప్రతిపాదలను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు... త్వరలోనే వాటిని సంబంధిత అధికారులతో చర్చిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా స్పందించేందుకు చొరవ తీసుకుంటామన్న హామీ లభించినట్లు ప్రతినిధులు మీడియాకు వివరించారు. కుల, చేతి వృత్తులతో పాటు కుటీర పరిశ్రమలకు ఆధునిక (టెక్నాలజీ) పరిజ్ఞానాన్ని జోడించి కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలను కల్పించడమే కాక కొత్తగా బీసీ ఇండస్ట్రియల్ పాలసీకి పునాదులు పడే విధంగా చొరవ తీసుకుంటామని భరోసా కల్పించారని తెలిపారు.

Advertisement

Next Story