Kejriwal : మరో పథకాన్ని ప్రకటించిన కేజ్రీవాల్.. టార్గెట్ ఓటర్లు వీరే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-23 14:54:32.0  )
Kejriwal : మరో పథకాన్ని ప్రకటించిన కేజ్రీవాల్.. టార్గెట్ ఓటర్లు వీరే..!
X

దిశ, నేషనల్ బ్యూరో : 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యమే లక్ష్యంగా ‘సంజీవని యోజన’ పథకాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో ఈ మేరకు మాట్లాడారు. ‘సంజీవని యోజన కింద 60 ఏళ్లు పైబడి అనారోగ్యానికి గురైన వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోవచ్చు. ఖర్చు అంతా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది. ఢిల్లీలో 20-25 లక్షల వరకు సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ప్రజల జీవితాల్లో ఈ పథకం భారీ మార్పు తెస్తుంది.’ అని కేజ్రీవాల్ అన్నారు. దళిత విద్యార్థుల ఉన్నత విద్య కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్కాలర్ షిప్, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద రూ.2100 చెల్లిస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక ఆప్ హామీలపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. ‘ఆప్ పదేళ్లుగా అధికారంలో ఉంది. కానీ ఢిల్లీని వారు పొల్యుషన్ ఫ్రీగా మార్చలేకపోయారు. 2025 వస్తున్నా యమునా నదిని శుద్ధి చేయలేదు. అన్ని ప్రమాణాలతో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తామని చెప్పి విస్మరించారు. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారు. పదేళ్లుగా ఏంచేశారో ఆప్ చెప్పాలి? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ పార్టీ హామీలు ఇస్తోంది.’ అని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed