- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎంఆర్ ఎగవేతలో అగ్రగణ్యుడు మాజీ ఎమ్మెల్యే షకీల్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో 44 మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ ను ఎగ్గొట్టి ఇప్పటికీ డిఫాల్టర్ లిస్టులో ఉన్నారు. దాదాపు రూ. 269 కోట్ల వరకు ప్రభుత్వానికి బకాయి పడ్డారు. రెండేళ్లుగా ప్రభుత్వానికి రిటర్న్ చేయాల్సిన సీఎంఆర్ రైస్ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రభుత్వం డిఫాల్ట్ లిస్టులో ఉన్న రైస్ మిల్లులకు నోటీసులు పంపినా, క్రిమినల్ కేసులు బుక్ చేసినా సీఎంఆర్ రిటర్న్ చేయడంలో బెట్టు చేస్తున్నారే తప్ప చెల్లించాల్సిన సీఎంఆర్ బకాయిలు చెల్లించడం లేదని అధికారులు చెపుతున్నారు. ప్రతి సీజన్ లో రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఎంపిక చేసిన రైస్ మిల్లులకు పంపించింది.
రైస్ మిల్లర్లు తీసుకున్న ధాన్యం మర ఆడించి (మిల్లింగ్ చేసి) 67శాతం బియ్యాన్ని మూడు, నాలుగు నెలల్లో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి ఎఫ్ సీఐ, సివిల్ సప్లయ్ శాఖకు రిటర్న్ చేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితం వరకు అప్పట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, డిఫాల్ట్ రైస్ మిల్లర్లకు ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటం కారణంగా సీఎంఆర్ రిటర్న్ చేసినా, చేయకపోయినా అధికార యంత్రాంగం చూసీ, చూడనట్లు మిన్నకుండిపోయారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ముగిసిపోయి 14 నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధికారులు రికవరీ కోసం చేసిన ప్రయత్నాలు మొదలయ్యాయి. సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇప్పటి వరకు సీఎంఆర్ బకాయిల్లో కేవలం రూ. 4.58 కోట్లు మాత్రమే రికవరీ కావడం గమనార్హం. డిఫాల్టర్లుగా ఉన్న పెద్ద తలకాయలు ఇప్పటికీ నయాపైసా చెల్లించడం లేదని, అధికారులు నోటీసులు పంపినా, ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు చేస్తున్నా కించిత్ స్పందన లేదని అధికారులు చెపుతున్నారు. ఇప్పటి వరకు డిఫాల్టర్ రైస్ మిల్లర్లలో కేవలం రూ. 4.58 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని తెలుస్తోంది. అంతకు మించి రికవరీ కావడం లేదని, అధికారులు సీఎంఆర్ బకాయిల రికవరీ కోసం నానా తంటాలు పడుతున్నట్లు చెబుతున్నారు. కొంత మంది కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకుని విషయాన్ని కోర్టు మెట్లెక్కించారని చెపుతున్నారు.
సీఎంఆర్ బకాయిల్లో టాఫర్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
సీఎంఆర్ బకాయిల్లో జిల్లాలో అందరి కంటే ఎక్కువ మొత్తంలో రూ. 72 కోట్లు బకాయిలతో డిఫాల్టర్ లిస్టులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ టాపర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఆడింది ఆటగా.. పాడింది పాటగా జిల్లాలో రాజకీయం నడిపిన షకీల్ సీఎంఆర్ రైస్ లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయి పడ్డ షకీల్ బోధన్ ఎమ్మెల్యే గా నామినేషన్ వేసేందుకు నో డ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అప్పటి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అంగీకరించలేదు. కలెక్టర్ నారాయణ రెడ్డి పై ఎన్నో రకాలుగా పొలిటికల్ ఫ్రెషర్స్ పెట్టినా కలెక్టర్ తగ్గకపోవడంతో షకీల్ కు రెండే దారులు మిగిలాయి.. ఒకటి సీఎంఆర్ బకాయిలు ప్రభుత్వానికి చెల్లించడం.. రెండోది నామినేషన్ వేయకుండా పోటీ నుంచి తప్పుకోవడం. ఈ రెండోది ఆయన రాజకీయ జీవితానికి పెద్ద నష్టంగా పరిణమించడంతో సీఎంఆర్ బకాయిలు చెల్లించకుండానే నోడ్యూస్ ఎలాగైనా సాధించాలని షకీల్ కేటీఆర్, కవితలను ఆశ్రయించి కలెక్టర్ పై పొలిటికల్ ప్రెషర్ పెంచాడు.
అయినప్పటికీ కలెక్టర్ ససేమిరా అనడంతో రైస్ మిల్లర్లను అందరినీ తీసుకుని కేటీఆర్, కవిత ల ద్వారా కేసీఆర్ వద్దకు వెళ్లి విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన అపారమైన రాజకీయ తెలివిని ఉపయోగించి పాము చావకుండా కర్ర విరగకుండా డిఫాల్టర్ లిస్టులో ఉన్న వారు సీఎంఆర్ రిటర్న్ కోసం ఆరు నెలల గడువును పెంచారు. కేవలం ఒక్క బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోసం కేసీఆర్ తీసుకున్న అనుకూల నిర్ణయం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎక్స్ టెన్షన్ గడువు అమలైంది. డిఫాల్టర్ లిస్టులో ఉన్న వందలాది మంది రైస్ మిల్లర్లకు వెసులుబాటు లభించింది. దీంతో కలెక్టర్ సినారె షకీల్‌కు నోడ్యూస్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి లైన్ క్లియర్ అయ్యింది.
తర్వాత జరిగిన ఎన్నికల్లో షకీల్ ఓడిపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షకీల్ కు కష్టాల కుంపటి మొదలైంది. 14 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సీఎంఆర్ బకాయిల కేసు మెడకు చుట్టుకుంది. సీఎంఆర్ బకాయిల్లో దాదాపు రూ. 72 కోట్లతో అగ్రగణ్యుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి నయా పైసా తిరిగి చెల్లించలేదని అధికారులు చెపుతున్నారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు జవాబు ఇవ్వకుండా, సీఎంఆర్ రిటర్న్ చేయకుడండా, జరిమానా డబ్బులు చెల్లించకుండా తప్పించుకుని దుబాయికి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇండియాకు రాగానే ఆయన అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. తాను ఇండియాలో ఉంటే తన అరెస్ట్ తప్పదని, జైలుకు వెళ్లడం ఖాయమనే భయంతో తనకు ఇండియా కన్నా దుబాయ్ పదిలమనే ఆలోచనతో దుబాయికి చెక్కేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఈ విషయంపై సంబంధిత జిల్లా అధికారిని సంప్రదించి వివరణ కోరగా.. జిల్లా వ్యాప్తంగా దాదాపు 7710 మెట్రిక్ టన్నుల బియ్యంకు సంబంధించి రూ. 269 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ. 4.50 కోట్లు రికవరీ అయినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ ఎండీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డిఫాల్టర్ లిస్టులో ఉన్న వారి నుంచి రికవరీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 58 రైస్ మిల్స్ డిఫాల్టర్స్ లిస్టులో ఉండగా వీటిలో 10 రైస్ మిల్స్ తమ బకాయిలు చెల్లించి క్లియరెన్స్ తీసుకున్నాయి. మరో 4 కూడా తమ బకాయిలు చెల్లించాయన్నారు. తం 48 రైస్ మిల్లులు ఇంకా డిఫాల్టర్ లిస్టులోనే కొనసాగుతున్నాయి. పలువురు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని, పలువురిపై రెవెన్యూ రికవరీ (ఆర్ ఆర్) యాక్టు కూడా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.