త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణాశాఖ మంత్రి

by Anjali |
త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణాశాఖ మంత్రి
X

దిశ, ప్రతినిధి, కడప: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఆయన ఉమ్మడి జిల్లాకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయనకు టీడీపీ నాయకులు, అనుచరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడతామన్నారు.

మంత్రికి అడుగడుగునా నీరాజనాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఈనెల 12న ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం మొదటిసారిగా రాయచోటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గువ్వలచెరువు ఘాట్ దగ్గర నుంచి ప్రజలు విశేష సంఖ్యలో రోడ్డు ఇరువైపులా బారులు తీరి ఘన స్వాగతం పలికారు. గువ్వల చెరువులో క్రేన్ ద్వారా భారీ గజమాలతో ప్రజలు స్వాగతం పలికారు. జనం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్లతో గువ్వల చెరువు, కొత్తరోడ్డు, నారాయణపురం, నీలకంఠరావుపేట, రామాపురం, గంగనేరు, కొండవాండ్లపల్లె, చిట్లూరు, బండపల్లె, బిట్స్ కళాశాల, రింగ్ రోడ్డు, మీదుగా రాయచోటి పట్టణంలో భారీ ర్యాలీ ద్వారా మంత్రివర్యులు పార్టీ కార్యాలయం చేరుకున్నారు.

రామాపురం ప్రజలు రెండు భారీ క్రైన్ ల ద్వారా గజమాలతో మంత్రివర్యులకు స్వాగతం పలికారు. అదేవిధంగా రోడ్డు కిరువైపులా ప్రజలు ఊరూరా నిలబడి బొకేలు, పూలమాలతో మంత్రికి స్వాగతం పలుకుగా ప్రతి ఒక్కరినీ మంత్రి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ పేరుపేరునా పలకరిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. గతంలో ఎన్నడూ ఎప్పుడూ చూడని విధంగా గువ్వల చెరువు ఘాటు నుంచి రాయచోటి టిడిపి కార్యాలయం వరకు ర్యాలీ ద్వారా ప్రజలు రావడంతో బస్సులో వెళ్లే ప్రయాణికులు ప్రజలకు, మంత్రివర్యులకు చేతులు ఊపుతూ ప్రయాణికులు తమ ఆనందం వ్యక్తం చేశారు. గువ్వలచెరువు ఘాట్ నుంచి రాయచోటి రింగ్ రోడ్డు వరకు భారీ సంఖ్యలో ప్రజలు మంత్రివర్యులను చూసేందుకు వాహనాలలో తరలి వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed