Nara Lokesh:‘సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
Nara Lokesh:‘సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి’.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవాళ(శనివారం) విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ(Vijayawada) పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్(Minister Nara Lokesh) మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని.. మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజం అని చెప్పారు.

ఈ క్రమంలో ‘‘మంగళగిరిలో 2019లో నేను ఓడిపోయాను.. కానీ పట్టుదలతో శ్రమించి రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచాను’’ అని చెప్పారు. గెలుపు ఓటములకు భయపడొద్దు అన్నారు. పరీక్షలు తప్పినందుకు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. విద్యావ్యవస్థను(Education system) రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించామని తెలిపారు. సమానత్వం విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. పుస్తకాల్లో ఆటలకు పురుషుల బొమ్మలు, ఇంటి పనులకు బాలికల బొమ్మలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో అసమానతలను తొలగించాలని ఆదేశించానని తెలిపారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story