Prathipadu Tdp: మా ఇంఛార్జిని మార్చండి మహాప్రభో..?

by srinivas |   ( Updated:2023-02-15 09:53:08.0  )
Prathipadu Tdp: మా ఇంఛార్జిని మార్చండి మహాప్రభో..?
X
  • ప్రతిపాడు టీడీపీలో ప్రకంపనలు
  • వరుపుల రాజాని మార్చాలంటూ ఏలేశ్వరంలో ధర్నాలు

దిశ , ప్రత్తిపాడు (అన్నవరం): ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశంలో నిరసనలు, ధర్నాలు మొదలయ్యాయి. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి వరుపుల రాజాను మార్చాలంటూ ఏలేశ్వరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని వరపుల రాజా అందలమెక్కిస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో రాజాకు కాకుండా బీసీ నాయకులకి ప్రత్తిపాడు సీటు కేటాయిస్తే సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు సీటు కేటాయిస్తామని అధిష్టానం కూడా పరోక్షంగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండడం నియోజకవర్గం బీసీ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయిందన్నారు.

ఈ నిరసన కార్యక్రమంలో పైల సుభాష్ చంద్రబోస్, ఉమ్మడి గోదావరి జిల్లాల బీసీ సెల్ మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రొంగల సూర్యరావు, నియోజకవర్గ బీసీ సంఘర్షణ సమితి కన్వీనర్ ఏపూరి శ్రీను, పతివాడ రాజేశ్వరరావు, ముచ్చి అప్పలరాజు, శిడగం కన్నారావు, కొల్లేపర సురేంద్ర, శ్రీను ,బుజ్జి ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story