Andhra Pradesh: ఏయూలో నియంత పాలన..జగన్‌కి జై కొట్టకపోతే వేధింపులే

by Indraja |
Andhra Pradesh: ఏయూలో నియంత పాలన..జగన్‌కి జై కొట్టకపోతే వేధింపులే
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను వ్యతిరేకించిన వారిని, తెలుగు దేశం, బీజేపీ, జనసేన నాయకులను రాజకీయంగా వేధింపులకు గురి చేస్తే.. చదువులు చెప్పాల్సిన ఆంధ్రా విశ్వవిద్యాయలం వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి అదే విధానాన్ని అంతకంటే దారుణంగా అమలు జరిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రసాద రెడ్డి వైస్ ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏయూలో ఉక్కు పాలన మొదలై వేధింపుల పర్వం యధేచ్చగా కొనసాగింది. జగన్ జపమే కాదు ఏయూలో వీసీ ప్రసాదరెడ్డి భజన చేయకుంటే, ఆయనకు పాదాభివందనం చేయకుంటే ఇక వారి పని అయిపోయినట్లే.

పల్లా శ్రీనివాస్ పార్టీ మారకపోవడంతో భార్యపై వేధింపులు

తొలుత తన విభాగంలో పనిచేస్తున్న తెలుగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాస్ భార్య అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్యా దేవిపై దృష్టి పెట్టారు. ప్రస్తుత గాజువాక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్‌ను నాలుగేళ్ల క్రితం వైసీపీలోకి మారాల్సిందిగా విజయసాయి రెడ్డి ఓత్తిడి తీసుకువచ్చారు. అందుకు పల్లా శ్రీనివాస్ అంగీకరించకపోవడంతో విజయసాయి కుడిభుజమైన ప్రసాదరెడ్డి ఏయూ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సహాయ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్న లావణ్యా దేవిపై వేధింపులు ప్రారంభించారు.

అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆమెకు ప్రొఫెసర్‌గా ప్రమోషన్ రాకుండా అడ్డుపడ్డారు. జేమ్స్ స్టీఫెన్ రిజిస్ట్రార్ అయ్యాక, ఆమెపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. కావాలని ఆమె ఆలస్యంగా డిపార్ట్మెంట్‌కి వచ్చారని ఆమెకు మెమో ఇవ్వడం, ఆమెపై వేలాకోలంగా మాట్లాడటంతో ఆమె నిస్పృహకు గురయ్యారు. మంచి అధ్యాపకురాలిగా పేరున్న ఆమెతో మిగిలిన తోటి అధ్యాపకులు మాట్లాడటం మానివేసేలా చేసారు.

చివరి అస్త్రంగా ఎన్నికల్లో పోటీ చేసిన భర్తకు హారతి ఇవ్వడాన్ని సాకుగా చూపి ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొందని తప్పుడు కంప్లైంట్ ఇప్పించి ఆమెను సస్పెండ్ చేశారు.

వల్లీ కుమారికి వేధింపులే

తెలుగుదేశం ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి సూచనలు అందించిన ఆంధ్రా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యురాలు వల్లి కుమారిపై వైస్ ఛాన్సలర్ ప్రసాద రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడ్డారు. వల్లికుమారిని మానసికంగా వేధించి, ఆమె కదలికలపై నిఘా పెట్టారు. వల్లికుమారి లేటుగా వచ్చిందని అటెండన్స్ రిజిస్టర్‌లో రెడ్ మార్కులు వేయడం, మెమోలు ఇవ్వడం, ఆమె స్కాలర్లను వేధించడం వంటి చర్యల కారణంగా చివరకు ఆమె ఆరోగ్యం కూడా పాడైంది.

బయట నుంచి వచ్చిన వారికే కీలక పదవులు

30 ఏళ్లుగా ఏయూలో పనిచేస్తున్న సీనియర్ ప్రోఫెసర్లు, అర్హులను పక్కన పెట్టి బయట నుంచి వచ్చిన అర్హత లేని జేమ్స్ స్టీఫెన్‌ను కేవలం క్రైస్తవ లాబీ పేరిట రిజిస్ర్టార్‌ను చేసిన ప్రసాదరెడ్డి అదే విధంగా పలు విభాగాల్లో ఏయూ రెగ్యులర్ ఆచార్యులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రైవేట్ కాలేజీల నుండి వచ్చిన వారిని, కొంతమంది స్కాలర్లను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వారిని కంప్యూటర్ సైన్స్ విభాగంలోకి తీసుకుని వారికి పెద్ద పీట వేసి వారితో పెర్మనెంట్ ఆచార్యులను, అధ్యాపకులను అవమానించారు. అసలీ విభాగంలో అవసరానికి మించి అధ్యాపకులను తీసుకోవడం కొన్ని ఆర్స్ట్ విభాగాలను అధ్యాపకుల కొరత పేరిట మూసేయడం ప్రసాదరెడ్డికే దక్కింది.

వీరి పెత్తనం ఏమిటో?

ఏయూ ఆచార్యులను కాదని ఓఎస్‌డీ లక్ష్మినారాయణ, బయట కాలేజీ నుండి అడ్డదారిలో ప్రవేశించిన జేమ్స్ స్టీఫెన్, రామ్ జీ తదితరులు సీనియర్ పెర్మనెంట్ ఆచార్యులపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ రావును ఒక రబ్బర్ స్టాంప్‌గా చేశారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలోని హ్యూమన్ రిసోర్స్ విభాగంలోని ఆచార్యులు కోటి జాన్‌ను బలవంతంగా బయటకి తోసివేసి రూమ్ లాక్ చేయించారు.

ఆయనతోనే తొలుత ఏయూలో వందల సంఖ్యలో భారీ వృక్షాలను కొట్టించి , చెరువులు పూడ్చించి అవసరం తీరాక బయటకు గెంటేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రిన్సిపాల్ రాజేంద్ర కర్మాకర్‌ను ఉపయోగించి సీనియర్ ఆచార్యుడు జాన్‌ను బయటకు పంపారు. హిందీ విభాగ ఆచార్యుడు నల్ల సత్యనారాయణ, సైకాలజీ ఆచారుడు ఎం వి ఆర్ రాజు, పొలిటికల్ సైన్స్ స్కాలర్ ఆరేటి మహేష్ ఇంకా ఎంతోమంది ప్రసాద రెడ్డి వేధింపుల పర్వంలో బలయ్యారు.



Next Story