బాబు రూటే సపరేటు.. సూపర్ సిక్స్ హామీల సంగతేంటి?

by Y.Nagarani |
బాబు రూటే సపరేటు.. సూపర్ సిక్స్ హామీల సంగతేంటి?
X

దిశ, ఏపీ బ్యూరో: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు రాజకీయ నాయకుడంటారు. సీఎం చంద్రబాబులో సరిగ్గా ఇదే ఆలోచన మొదలైనట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఘోర ఓటమితో లేవలేని స్థితిలో ఉన్న వైసీపీని తట్టి లేపడం ఎందుకనుకున్నారో ఏమో.. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో లడ్డూలో నెయ్యి కల్తీ గురించి పార్టీ యంత్రాంగం ఏది పడితే అది మాట్లాడొద్దని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిపై దృష్టి సారించాలని నిర్దేశించారు. మరోవైపు వైసీపీ నుంచి జనసేనలోకి క్యూ కడుతున్న నేతల గురించి నిశితంగా పరిశీలిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరుగుతున్నట్లు ఎన్​డీడీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు ఇటీవల బయట పెట్టారు. దీంతో వైసీపీని మరింత వెనక్కి కొట్టాలని భావించారు. దీనిపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆలోచనలో పడ్డారు. రాజకీయంగా ఇది తమకు ఎలాంటి ఉపయోగం లేదని భావించినట్లుంది. దీనిపై పార్టీ యంత్రాంగం నోరు మెదపవద్దని సంకేతాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిపై మాత్రమే మాట్లాడాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. నిరంతరం ప్రజలతో మమేకం కావాలని నిర్దేశించారు. ప్రస్తుతానికి సూపర్​ సిక్స్​లో పింఛన్ల హామీ మాత్రమే నెరవేరింది. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవిగాక నైపుణ్య గణన చేపట్టి యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు.

కేంద్రంపై ఒత్తిడి..

సెప్టెంబరులో ప్రభుత్వానికి సవాలుగా నిల్చిన వరదల్లో బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. దీనిపైనే ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ కార్యకర్తలు దృష్టి సారించాలని ఆదేశించారు. నష్టపోయిన కుటుంబాల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత వ్యక్తమయ్యే స్థాయిలో సాయం అందించాలని సీఎం భావిస్తున్నారు. జాతీయ విపత్తుగా భావించి కేంద్రం ఇతోధికంగా సహకారం అందించాలని అడుగుతున్నారు. అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సిద్దమవుతున్నారు. మరోవైపు పోలవరానికి ఏడు వేలకోట్ల రూపాయల పై చిలుకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

హామీల అమలుపై భరోసా..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకున్నా ఎక్కడా బేలతనం ప్రదర్శించకుండా గుంభనంగా నెట్టుకొస్తున్నారు. ఓవైపు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూనే మరో వైపు సెంట్రల్ లింకేజ్డ్ పథకాలకు నిధులు సమకూర్చే పనిలో సీఎం తలమునకలవుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల కోసం సగటు ప్రజలు ఎదురు చూస్తున్నారని గ్రహించి దశలవారీ అమలు చేస్తామని పదేపదే చెబుతున్నారు. హామీల నుంచి వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెబుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం పెంపునకు ఏం చేయాలి.. కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనే అంశాలపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story

Most Viewed