చాంతాడంత వెయిటింగ్ లిస్ట్.. సొంతూరికి దారేది?

by Y.Nagarani |
చాంతాడంత వెయిటింగ్ లిస్ట్.. సొంతూరికి దారేది?
X

దిశ, వెబ్ డెస్క్: హిందువులకు పెద్ద పండుగలైన దసరా, సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లడం అంత ఈజీ కాదు. బస్సులు, రైళ్ల (Dasara Trains) సర్వీసులు కాదు కదా.. సొంత వాహనంలో వెళ్లడానికైనా టోల్ గేట్ల వద్ద గంటల సమయంపాటు వేచి ఉండక తప్పదు. నేటి నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. విద్యాసంస్థలకు 10 రోజులు సెలవులు. దీంతో ఉద్యోగాలు, ఉపాధి, కోర్సుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా సొంత ఊరికి వెళ్లేందుకు పయనమవుతున్నారు. అప్పటికప్పుడు టికెట్ తీసుకున్నవారే కాదు.. ముందుగా రైలు, బస్సుల్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నవారు కూడా స్వగ్రామానికి వెళ్లేందుకు కష్టపడాల్సిన పరిస్థితి.

రైలులో టికెట్ రిజర్వేషన్ చూస్తే.. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్. కొన్ని రైళ్లైతే రిగ్రెట్ కూడా అయ్యాయి. దసరా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అక్టోబర్ లో ఏపీ, నార్త్ ఇండియా రూట్లలో అదనంగా 650 రైళ్లను నడుపుతోంది. జనరల్ టికెట్ ఉన్నవారు కూడా స్లీపర్ క్లాసుల్లో ఎక్కడంతో.. రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. అదేమంటే జనరల్ బోగీలు ఖాళీ లేవన్నది వారి సమాధానం. మరి రిజర్వేషన్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి అని అడిగితే.. టీసీలు చేతులెత్తేస్తున్నారు. రద్దీ సమయంలో తామేమీ చేయలేమంటున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లేవారు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి వెళ్లే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు 200 రైళ్లలో 1,70,000 మంది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి ప్రయాణిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్ని ప్రత్యేక రైళ్లు నడిపినా.. ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. దసరాకి కాదు కదా.. మరో నాలుగు నెలల సమయం ఉన్న సంక్రాంతి రిజర్వేషన్లు కూడా ఫుల్ అయ్యి.. రిగ్రెట్ అయ్యాయి.

రైళ్ల పరిస్థితి అలా ఉంటే.. బస్సులో ప్రయాణించేవారి బాధ వర్ణనాతీతం. నాన్ స్టాప్ సర్వీసులు మినహా.. లోకల్ బస్సులను చూస్తే.. గాలి కూడా దూరలేనంత జనం కనిపిస్తున్నారు. బస్సులోపల ఉన్నవారికి ఊపిరి కూడా అందడం లేదు. ఏపీఎస్ ఆర్టీసీ, టీజీ ఆర్టీసీ బస్సుల రిజర్వేషన్లు ఫుల్ అవ్వడంతో ప్రైవేట్ ట్రావెల్స్ దొరికిందే ఛాన్సుగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఏసీ స్లీపర్ క్లాస్ టికెట్ ను ఏకంగా 3000 రూపాయలకు అమ్ముకుంటున్నాయి. సాధారణంగా అయితే ఈ టికెట్ రేటు రూ.1000 వరకు ఉంటుంది. ఇక మన ఆకలికి దొరికిందే ప్రసాదం అన్నట్టుగా.. కచ్చితంగా ఊరు వెళ్లాలనుకున్నవారు వాటినే కొనుక్కుంటున్నారు.

Next Story

Most Viewed