Police Vs Tdp కార్యకర్తలు...Kuppam లో క్షణం.. క్షణం

by srinivas |   ( Updated:2023-01-04 11:29:03.0  )
Police Vs Tdp కార్యకర్తలు...Kuppam లో క్షణం.. క్షణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు మండలాలలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంతో పాటు మరోవైపు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపాలని చంద్రబాబు భావించారు. ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్ సైతం ఖరారు చేశారు. అయితే చంద్రబాబు నిర్వహించిన కందుకూరు, గుంటూరు ప్రోగ్రాంల్లో చోటు చేసుకున్న విషాదఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ జీవో నెం1 విడుదల చేసింది. ఇందులో బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారమే చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ ఇప్పటికే టీడీపీ నేతలకు నోటీసులు సైతం ఇచ్చింది. అయితే వారు స్పందించకపోవడంతో చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని తేల్చిపారేసింది. ఈ జీవోలన్నీ టీడీపీ, చంద్రబాబు సభలను అడ్డుకోవడానికేనని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారో పెట్టుకోమనండని, తాము మాత్రం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని తెలుగుతమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. మరోవైపు కొంతమందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కుప్పంలో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఏమిటీ విపత్కర పరిస్థితి?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ ఘటనకు సంబంధించి పలువురు జైలుకు సైతం వెళ్లారు. ఈ ఘటన మరిచిపోకముందే మరో పరాభవం ఎదుర్కోబోతున్నారు. నూతన సంవత్సరం వేళ తన సొంత నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలోని కీలక నేతలు, మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయి వరకు వెళ్లి వారిలో నూతన ఉత్సాహం నింపాలని భావించారు. అయితే కొత్త ఏడాదిలో అందులోనూ తన సొంత అడ్డాలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే చీకటి జోవోలు విడుదల చేసిందని మండిపడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై అటు జనసేన, ఇటు బీజేపీ ఇతర పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చీకటి జీవోలు తీసుకువచ్చినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు కుప్పం పర్యటనను విజయవంతం చేస్తామని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. దీంతో కుప్పంలో ఏం జరుగుతోందనన్న ఆందోళన రాజకీయంగా నెలకొంది.

అనుమతి లేదంటున్న పోలీసులు

స్థానిక ఎమ్మెల్యేగా కుప్పంలో ఎక్కడైనా.. సభలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందని తెలుగుతమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు సభను జరిపి తీరుతామని.. తమను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ పోలీసులను హెచ్చరిస్తుంది. అయితే టీడీపీ నేతలకు పోలీస్ శాఖ సైతం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు కుప్పం పర్యటనలో రోడ్ షోలకు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ శాఖ అధికారులు టీడీపీ నేతలకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి వ్యక్తిగత కార్యదర్శికి పోలీస్ శాఖ నోటీసులు ఇచ్చిందని అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు అనుమతించలేదని పోలీసులు వెల్లడించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలను నిర్వహించినా, అందులో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో గట్టిగా హెచ్చరించారు.

కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం

ప్రభుత్వం రోడ్లపై ర్యాలీలు, రోడ్‌షో, బహిరంగ సభలు నిషేధించిన నేపథ్యంలో టీడీపీ ప్రచార రథం డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా ప్రచార రథాన్ని సిద్ధం చేయటానికి శుభ్రం చేస్తున్న క్రమంలో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటించనున్న వాహనాన్ని సైతం పోలీసులు నిలిపేశారు. చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక వెళుతుండగా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనలో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రచార రధాన్ని అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. టీడీపీ ప్రచార రథం, సౌండ్ వాహనం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాదు డ్రైవర్లు, సిబ్బందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే లేఖ ఇచ్చామని అదే విషయాన్ని చెప్తున్నా పోలీసులు వాహనాలను తీసుకెళ్లిపోయారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

రచ్చబండ స్టేజీ తొలగింపు

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి శాంతిపురం మండలానికి పోలీసుల తరలివచ్చారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని టీడీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలో అన్ని చోట్ల భారీగా పోలీసుల మోహరించారు. ప్రతి గ్రామంలో, కూడళ్ళలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలు దర్శనమిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : బిగ్ బ్రేకింగ్ : కుప్పంలో హై టెన్షన్.. చంద్రబాబు ప్రచార రథం అడ్డగింత..!

Advertisement

Next Story

Most Viewed