Nara Lokeshకు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ సెగ

by srinivas |
Nara Lokeshకు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ సెగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఫీవర్ నడుస్తూనే ఉంది. టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ టీడీపీలోని ఓ వర్గం నేతలతోపాటు కార్యకర్తలు, నందమూరి అభిమానుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సైతం ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. చంద్రబాబు ఎక్కడికెళ్లినా ఆయనకు స్వాగతం పలికేవారిలో ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటూనే ఉన్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సైతం జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఆదివారం పీలేరు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. అయితే పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు వెలియడం సంచలనంగా మారింది. అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పీలేరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు. లోకేశ్ ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా ఫ్లెక్సీలు వెలియడం హాట్ టాపిక్‌గా మారింది.

చంద్రబాబుకు తారక్ అభిమానుల సెగ

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితిపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ప్రస్తుతం టీడీపీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చే సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని, టీడీపీలోని ఓ వర్గంతోపాటు కార్యకర్తలు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగా వ్యక్త పరుస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువస్తున్నారు తెలుగుతమ్ముళ్లు. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో సైతం నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. గతంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ఎన్టీఆర్ అభిమానులు నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే తరుణంలో ఒక దిమ్మకు ఎన్టీఆర్ జెండా కట్టి మరీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగిపోలేదు. 40 అడుగుల ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జూనియర్‌ ఎన్టీఆర్‌ స్లోగన్స్‌తో హోరెత్తించారు. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అనంతరం టీడీపీ నేత కాగితపు వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మచిలీపట్నంకు వెళ్లిన చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ళు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఒక చేత్తో టీడీపీ జెండాలతోపాటు మరో చేత్తో ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ చర్యలు చంద్రబాబుకు కాస్త అసహనం కలిగించేలా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

లోకేశ్‌కు తగిలిన సెగ

ఇదిలా ఉంటే తారక్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీలోకి ఆహ్వానించారు. తారక్ వస్తానంటే రెడ్ కార్పెట్ సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. తారక్ లాంటి వారి వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని.. సమాజం మంచి కోరేవాళ్లు రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ ఆహ్వానంపై మాజీమంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌లు తీవ్రంగా ధ్వజమెత్తారు. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీ జూనియర్ ఎన్టీఆర్‌దే అవుతుందని, లోకేశ్ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అసలు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేశ్ ఎవరని ప్రశ్నించారు. అది ఖర్జూర నాయుడు పెట్టిన పార్టీ కాదని..ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని లోకేశ్ గుర్తుంచుకోవాలని నేతలు హితవు పలికిన సంగతి తెలిసిందే. ఇలా ప్రత్యక్షంగా తారక్‌ను లోకేశ్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ నిరసన సెగ మాత్రం తగులుతూనే ఉంది. లోకేశ్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ఎంటరైంది. ఈ నేపథ్యంలో పీలేరులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ పీలేరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు వేయించారు. అయితే ఈ ఫ్లెక్సీలు నిజంగానే తారక్ అభిమానులు వేయించారా?, లేక తప్పుదోవ పట్టించేందుకు వేలిశాయా అన్న సందేహాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తారక్‌ను స్వయంగా లోకేశ్ ఆహ్వానించినప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు వెలవాల్సిన అవసరం లేదని కాబట్టి ఇందులో ఏదో దురుద్దేశం ఉందని తెలుగుతమ్ముళ్లు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story