Tirumala News:ఈ నెల 30 నుంచి తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు

by Jakkula Mamatha |
Tirumala News:ఈ నెల 30 నుంచి తిరుమలలో ఘనంగా అధ్యయనోత్సవాలు
X

దిశ,తిరుమల: తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2025 జ‌న‌వ‌రి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఈ సందర్భంగా స్వామి వారి ప్రాశస్త్యం పై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్టిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Advertisement

Next Story

Most Viewed