గుంతల రోడ్డు పై వాహనదారుల అవస్థలు..

by Sumithra |
గుంతల రోడ్డు పై వాహనదారుల అవస్థలు..
X

దిశ, వేమనపల్లి : మల్లంపేట నుండి నీల్వాయికి వెళ్లే ప్రధాన రహదారి వెంట నిత్యం వందలాది వాహనాలు అధిక లోడుతో ప్రయాణించడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అటవీ మార్గంలో ఉండే రహదారి పై అనేక గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే మార్గం గుంతల మయంగా మారడంతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. నిత్యం అధికారులు ఇదే మార్గంలో ప్రయాణం చేస్తున్న రోడ్డు మరమ్మతుల పై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఈ అడవి మార్గంలో రోడ్డు గుంతలు ఏర్పడడంతో రాత్రివేళ ప్రయాణం నరకంగా ఉందని ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మల్లంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన అధికారులు పూర్తి రోడ్డు నిర్మాణం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. అడవి మార్గంలో ఉన్న రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు లేనందున రోడ్డు పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంలో జాప్యం జరుగుతుందని సంబంధిత శాఖ అధికారులు తెలుపుతున్నారు. కనీసం గుంతలు అయినా పూడ్చి రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు. అనుమతుల్లో జాప్యం ఉంటే కనీసం మరమత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed