Tirupati: దారి కోసం దండయాత్ర.. 15 రోజులే గడువు ఇస్తూ వార్నింగ్

by srinivas |
Tirupati: దారి కోసం దండయాత్ర.. 15 రోజులే గడువు ఇస్తూ వార్నింగ్
X

దిశ, తిరుపతి: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ పూర్ణకుంభం సర్కిల్ వద్ద రైల్వే బ్రిడ్జిపై శ్రీనివాస సేతు నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పూర్ణకుంభ సర్కిల్ రైల్వే బ్రిడ్జి పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ తిరుపతికి ప్రతిరోజు లక్షల మందికిపైగా యాత్రికులు వస్తున్నారని, ట్రాఫిక్ అంతరాయంతో నగరవాసులు, యాత్రికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ నిధులు, టీటీడీ నిధులతో పనులు చేపట్టి ఐదేళ్లవుతున్నా శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయడం లేదని వాపోయారు.

స్థానిక ఎస్పీ, కమిషనర్ నెల రోజుల్లో శ్రీనివాస చేతు పూర్తి చేస్తామని చెప్పి పూర్ణకుంభ సర్కిల్ వద్ద 40 రోజులుగా వాహనాలు రానివ్వకుండా నిలిపివేశారని తెలిపారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని, కొంతమంది అధికారులు కమిషన్ కోసం కక్కుర్తి పడి రైల్వే బ్రిడ్జిపై ఫ్లై ఓవర్ పనులకు అనుమతి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కలెక్టర్, టిటిడి ఈవో, ఎస్పీ స్థానిక ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని ప్రజలకు అంతరాయం లేకుండా శ్రీనివాస సేతుని తక్షణమే పూర్తి చేయాలని హెచ్చరించారు.

భక్తుల కానుకల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందంటే.. అలాంటి యాత్రికులను ఇబ్బంది పెట్టడం వల్ల టీటీడీని ఏమి అభివృద్ధి చేస్తారని వాపోయారు. టీటీడీ యాజమాన్యం కూడా శ్రీనివాసా సేతకు ఇవ్వాల్సిన నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. 15 రోజుల్లో పూర్తి చేయకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పూర్ణకుంభ సర్కిల్ వద్ద ప్రజలకు దారిని ఏర్పాటు చేస్తామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story