Chittoor: ఎమ్మెల్యే కుటుంబ సంస్థకు మరో 22.10 ఎకరాలు ధారాదత్తం

by srinivas |
Chittoor: ఎమ్మెల్యే కుటుంబ సంస్థకు మరో 22.10 ఎకరాలు ధారాదత్తం
X

దిశ, చిత్తూరు: చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్న జేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు మరో 22.10 ఎకరాలు ధారాదత్తం చేస్తూ చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపారు. గతేడాది జూన్‌ 1న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఇదేవిధంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో పాటు ఆయన సోదరుడి కుమారుడికి చెందిన సంస్థలకు చిత్తూరు మండలంలోని బండపల్లె, మాపాక్షి, నరిగపల్లె రెవెన్యూల్లోని 83 ఎకరాల గుట్ట, ప్రభుత్వ భూములను లీజుకు ఇస్తున్నట్లు తీర్మానం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తాజాగా నరిగపల్లె రెవెన్యూలో 548.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టలో 22.10 ఎకరాల భూమిని లీజు పేరిట ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన సంస్థకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చిత్తూరు మండలం మీదుగా చిత్తూరు- తచ్చూరు, బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రహదారులు వెళ్తున్నాయి. రూ.21వేల కోట్ల వ్యయంతో వీటి నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకు గ్రావెల్‌, కంకర (గుళ్లరాయి) అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో నరిగపల్లెలో 22.10 ఎకరాల భూమిని క్రషర్‌ ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించాలంటూ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన సంస్థ కలెక్టర్‌, తహసీల్దారు కార్యాలయాలను కోరింది. తహసీల్దారు కార్యాలయం ఈ ఏడాది జనవరి 18న ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆ ప్రాంతం చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో ఆమోదం కోసం నగరపాలక సంస్థకు పంపింది. పట్టణ ప్రణాళిక సిబ్బంది అక్కడకు వెళ్లి పరిశీలించి క్రషర్‌ ఏర్పాటుకు భూమిని కేటాయించవచ్చని నివేదిక ఇచ్చారు. కౌన్సిల్‌లో తీర్మానానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావించి తహసీల్దారు నుంచి లేఖ వచ్చిన 21 రోజుల్లోనే మేయర్‌ నుంచి ఆమోదం తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఏడాది వ్యవధిలోనే 105.10 ఎకరాలను ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు చెందిన సంస్థకు లీజు పేరిట కౌన్సిల్‌ ధారాదత్తం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story