మరికాసేపట్లో హైదరాబాద్‌కు చంద్రబాబు: రేపు ఏఐజీ, ఎల్వీప్రసాద్ ఆస్పత్రులలో వైద్యపరీక్షలు

by Seetharam |   ( Updated:2023-11-01 10:28:29.0  )
మరికాసేపట్లో హైదరాబాద్‌కు చంద్రబాబు: రేపు ఏఐజీ, ఎల్వీప్రసాద్ ఆస్పత్రులలో వైద్యపరీక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే వైద్యులు చికిత్స చేయించుకునేందుకు రావాలని చంద్రబాబును కోరడంతో బుధవారం హైదరాబాద్ వెళ్లనున్నారు. బుధవారం మధ్యాహ్నాం 3 గంటలకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 3.45 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. 4గంటలకు శంషాబాద్ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. 4.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గూండా సాయంత్రం 5 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి పయనమవుతారు. సాయంత్రం 5.50 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. ఈ మేరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భద్రత విషయంలో అటు ఏపీ పోలీసులను, అటు తెలంగాణ పోలీసులను చంద్రబాబు నాయుడు సిబ్బంది విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు టూర్ షెడ్యూల్‌ను మెయిల్ ద్వారా అధికారులకు పంపారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యాహ్నాం హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఇకపోతే రాత్రికి హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు విశ్రాంతి తీసుకుంటారు. గురువారం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.

Advertisement

Next Story