చంద్రబాబు బెయిల్ పిటిషన్: నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి

by Seetharam |   ( Updated:2023-10-27 05:45:35.0  )
చంద్రబాబు బెయిల్ పిటిషన్: నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు గురువారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పిటిసన్‌పైనా విచారణ జరపాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మాయి ప్రతాప్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ బెంచ్ ముందు నేటి విచారణ జాబితాలలోకి 8వ నెంబర్‌గా చేర్చారు. దీంతో శుక్రవారం ఈ కేసుకు సంబంధించి విచారణ జరగకుండానే నాట్ బిఫోర్ మీ అని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ అన్నారు. ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా తాను అధ్యయనం చేయాల్సి ఉన్న నేపథ్యంలో వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు బదిలీ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈనెల 30న విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు స్కిన్ సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాల్సి ఉందని హౌస్ మోషన్ పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్లపై ఈనెల 30న విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed