పొత్తులపై ఆ పార్టీనే ముందుకు రావాలి..ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2024-01-04 13:30:10.0  )
పొత్తులపై ఆ పార్టీనే ముందుకు రావాలి..ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. అటు జనసేన, టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తాయని ఇప్పటికే పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులపై గందరగోళం నెలకొంది. పవన్ కల్యాణ్ బీజేపీతో ఉంటారా.. లేక టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా...? అనే దానిపై స్పష్టత లేదు. అటు బీజేపీ, టీడీపీని కలిపే బాధ్యత పవన్ తీసుకుంటారా అంటే దానిపై కూడా క్లారిటీ లేదు. మరోవైపు టీడీపీ, బీజేపీ నేతలు అసలు పొత్తులపై ఎక్కడా ప్రసంగాలు చేయడంలేదు. దీంతో అసలు ఈ మూడు పార్టీల పొత్తులు ఉంటాయా..? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇదిలా ఉంటే టీడీపీ, జనసేనతో పొత్తుపై గురువారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించారు. తాము ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నామని చెప్పారు. ఎవరైతే పొత్తులు కోరుకుంటారో ఆ పార్టీ నేతలు తమ అధిష్టానాన్ని సంప్రదించి చర్చించాలని సూచించారు. పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న పార్టీని బీజేపీ హైకమాండ్ వద్దకు ఎవరైతే తీసుకెళ్లాలనుకుంటున్నారో వారు త్వరగా ముందుకు రావాలని కమలం నేతలు పిలుపు నిచ్చారు.


పొత్తులు అనేవి కేంద్ర నాయకత్వం నిర్ణయని బీజేపీ నేత సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయని చెప్పారు. ఏపీలో బీజేపీ బలహీనంగా ఉందని, బలమైన పార్టీ ముందుకు వచ్చి పొత్తులపై చర్చించాలని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే పవన్‌తో కలిసి వెళ్లాలని తాము నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. అయితే తాము ఎవరితోనైతే కలవాలని పవన్ అనుకుంటున్నారో ఆ పార్టీ నుంచి స్పందన రావాలి కదా అని ప్రశ్నించారు. పొత్తుల వ్యవహారాన్ని బీజేపీ అగ్ర నేతల దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్లారని సత్య కుమార్ వెల్లడించారు. కానీ మాతో కలవాలనుకుంటున్న పార్టీతో పవన్ చెప్పించాలి కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమయం సమీస్తున్న తరుణంలో త్వరగా పొత్తులపై తేల్చాలని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed