హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

by sudharani |
హిందూపురం సీఐ ఇస్మాయిల్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో : హిందూపురం సీఐ ఇస్మాయిల్‍పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయడానికి సీఐకి ఎంత ధైర్యమంటూ మండిపడింది. సీఐ చర్య కోర్టు పరిపాలనా విధులకు ఆటంకమేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. అడ్వకేట్ కమిషన్, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటనలో సీఐ ఇస్మాయిల్‍పై సుమోటో పిల్ నమోదు చేసిన ఏపీ హైకోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్‌ అనే వ్యక్తి­ నిర్బంధం విషయంలో దాఖలైన పిటిషన్‌పై హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు విచారణ జరిపింది.

ఈఘటనపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వాస్తవాలను పరి­శీలించి నివేదిక ఇవ్వాలని న్యాయవాది ఉదయ్‌­సిం­హారెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్‌ 21న ఉదయ్‌సింహారెడ్డి కోర్టు సిబ్బంది, గిరీష్‌ తరఫు న్యా­య­వాది, అతని కుటుంబ సభ్యులతో కలిసి హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేష­న్‌కు వెళ్లారు. పోలీసుల నిర్భంధంలో ఉన్న గిరీష్‌ను పోలీసులు కొట్టారని గుర్తించిన న్యాయవాది ఉదయ్ సింహారెడ్డి..గిరీష్‌కి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్‌ను ఉదయ్‌సింహారెడ్డి కోరా­రు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్‌ కమిషనర్‌తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు.

దీనిపై ప్రిన్సి­పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సదరు ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరారు. సీఐ వివరణతో సంతృప్తి చెందని జడ్జి ఈ విషయాన్ని డీఐజీ, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా ఉన్న హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవా­నంద్‌ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమో­టో పిల్‌గా పరిగణించాలని తగిన ఉత్తర్వుల నిమి­త్తం సీజే ముందుంచాలని జస్టిస్‌ దేవా­నంద్‌ రిజిస్ట్రీని ఆ­దేశించిన సంగతి తెలిసిందే.

వివాదాల్లో సీఐ ఇస్మాయిల్

హిందూపురం వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ వరుస వివాదాలు ఎదుర్కొంటున్నారు. గతంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ఘటనలో సీఐ పేరు ప్రముఖంగా వినిపించింది. లాఠీచార్జిని నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేయగా వారిపై అసభ్యకరంగా దూషించారని బీజేపీ ఆరోపించింది. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఖాకీ చొక్కా విప్పి రావాలని నువ్వే నేనో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరడం అప్పట్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నవీన్ నిశ్చల్ ‘నీకంత మోజుగా ఉంటే ఖాకీ చొక్కావిప్పి రాజకీయాల్లోకి రా.. నీవు రాజకీయాల్లోకి రా.. లేదా పోలీసుగా నిబద్ధతగా డ్యూటీ చెయ్‌. వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఖాకీ దుస్తులు వదిలేసిరా..! చిల్లర పనులు చేయొద్దు..’ అని గట్టిగా హెచ్రించారు. ‘నేను జనసేనలోనికి పోతానని అంటున్నావ్‌. నీకెవరు చెప్పారు? నీకేమైనా జోస్యం వచ్చా? లేదా పైనుం చి ఎవరైనా వచ్చి చెవిలో చెప్పారా? నీవల్ల ఖాకీలకు కళంకం వస్తోంది. నీకు చేతనైతే ఎవరి మోచేతికింద నీళ్లు తాగుతున్నావో వారి వద్దకు వెళ్లి.. గ్రూపులు వద్దు’ అని నవీన్ నిశ్చల్ సీఐ ఇస్మాయిల్‌పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే

Advertisement

Next Story

Most Viewed