Minister Peddi Reddyకి అసమ్మతి సెగ.. కాన్వాయ్‌పై చెప్పులు

by srinivas |   ( Updated:2022-12-17 15:39:52.0  )
Minister Peddi Reddyకి అసమ్మతి సెగ.. కాన్వాయ్‌పై చెప్పులు
X
  • ఉమ్మడి అనంతలో బయటపడుతున్న అసమ్మతి
  • ఇప్పటికే మడకశిర, హిందూపురంలో బట్టబయలు
  • అసమ్మతి తలనొప్పికి మందెలా?

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో మరో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఇప్పటికే మడకశిర, హిందూపురం వైసీపీలో అసమ్మతి సెగలు రగులుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెనుకొండ నియోజకవర్గంలో వర్గపోరు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షిగా బహిర్గతమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో అన్నీ తానై వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో వైసీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో వరుస విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


పెద్దిరెడ్డి ఎదుటే నిరసనలు

ఇటీవలే రీజినల్ కో ఆర్డినేటర్ హోదాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మడకశిర, హిందూపురంతోపాటు పలు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు బట్టబయలైంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారిని బుజ్జగించడంతో అంతా సద్దుమణిగింది. శనివారం పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ విస్తృత సమావేశం నిర్వహించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశానికి హాజరవుతుండగా మాజీమంత్రి, ఎమ్మెల్యే శంకరనారాయణ వ్యతిరేక వర్గం అడ్డుకుంది. శ్రీకృష్ణదేవరాయల కూడలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శంకరనారాయణలకు నిరసన సెగ తగిలింది. మాజీమంత్రి శంకరనారాయణ వ్యతిరేక వర్గం వారికి వ్యతిరేకంగా నిరసనకు దిగింది. శంకరనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. ఇంతలో మాజీమంత్రి శంకరనారాయణ అనుచర వర్గీయులు సైతం అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. అసమ్మతి నేతలు మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. అనంతరం అక్కడ నుంచి విస్తృతస్థాయి సమావేశానికి మంత్రి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed