సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ఉక్కుపాదం

by srinivas |   ( Updated:2022-12-01 15:54:34.0  )
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై ఉక్కుపాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను వినియోగిస్తే భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనల్లో సవరణలు తీసుకొస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు వేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్యాన్ని సృష్టించేవారే వ్యయాన్ని భరించాలనే నిబంధన ఆధారంగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం భావించింది. అలాగే పాలిథిన్‌ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, విక్రయాలు,ఈ కామర్స్‌ కంపెనీలపైనా దృష్టి పెట్టాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్‌ వినియోగంపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ అంశంపై దృష్టి సారించాలని ఆదేశాలిచ్చింది.

ఎవరికి ఎంత జరిమానా అంటే

నిషేధించిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మెుదటి తప్పుకు రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధించనుంది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను స్టాక్‌ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్‌ స్థాయిలో రూ.25వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు సీజ్‌ చేసిన ఉత్పత్తులపై కేజీకి రూ.10చొప్పున పెనాల్టీ విధించనున్నారు. ఇకపోతే వీధి వ్యాపారులు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌లను వినియోగిస్తే రూ.2500 నుంచి రూ.5వేలు, దుకాణాలు, సంస్థలు, మాల్స్‌ తదితర ప్రదేశాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు విక్రయిస్తే రూ.20వేల నుంచి రూ.40వేల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story