TTD: హోటళ్లలో తినుబండారాలపై ఫిర్యాదు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలి:టీటీడీ ఈవో

by Jakkula Mamatha |
TTD: హోటళ్లలో తినుబండారాలపై ఫిర్యాదు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలి:టీటీడీ ఈవో
X

దిశ, తిరుమల:తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు రెండు చెత్త బిన్ల వ్యవస్థను నిర్వహించాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల నుంచి అభిప్రాయాన్ని పొందడానికి ఫిర్యాదు/సూచనల పెట్టెను ఏర్పాటు చేయాలన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం లోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా సేకరించాలన్నారు. తమ హోటల్‌ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. హోటళ్ళు ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు క్రింది మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఆహార పదార్ధాలలో సింథటిక్ రంగులు/ నిషేధించబడిన రంగులు ఉపయోగించలేదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టేస్ట్ ఎంహేన్సర్ తో చేసిన పదార్థాలు తినరాదు. హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్ లీజుకు ఇవ్వలేదు.అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు.

సవరించిన ధరలను రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు. ‘తిరుమలలోని అన్ని క్యాంటీన్‌ల వారికి ఆగస్టు 5 తర్వాత ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తామని తెలియజేశారు. వాటర్‌ బాటిళ్లు కూడా రూ.20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం అన్నప్రసాదం, దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర కుమార్, సెల్వం, శ్రీమతి ఆశాజ్యోతి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డా.సునీల్ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story