బర్త్ డే కోసం రూ.100 కోట్లు ఖర్చు.. జగన్‌వి రాచరిక పోకడలు : అచ్చెన్నాయుడు

by Seetharam |
బర్త్ డే కోసం రూ.100 కోట్లు ఖర్చు.. జగన్‌వి రాచరిక పోకడలు : అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వినూత్న రీతిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియాజేశారు. ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుద లచేశారు. బర్త్ డే పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకు ప్రకటనల రూపంలో రూ.100 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం జగన్ రెడ్డి పెత్తందారీ పోకడలను తెలియజేస్తోంది అని మండిపడ్డారు. నెలకు ఒక్క రూపాయే గౌరవ వేతనం తీసుకుంటానని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి ...పుట్టినరోజు పేరుతో కోట్లు ఖర్చు చేయడం ఆయన రాచరిక పోకడలకు అద్దం పడుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, సొంత పత్రికకి ప్రకటన ఇవ్వడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉపయోగకరమైన పనులు చేయడంపై ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. జీతాలు పెంచమని అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కోసం కోట్ల రూపాయిలు వృథా చేయడం దేనికి సంకేతం? అంటూ నిలదీశారు. పైగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. పన్నుల బాదుడు, చార్జీల మోత, నిత్యావసరాల పెంపుతో పేద, మధ్యతరగతి నడ్డి విరిచారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇన్ని వైఫల్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటే గ్రాండ్ బర్త్ డే ఎలా చేసుకోవాలపించిందో జగన్ రెడ్డికే తెలియాలి అని అచ్చెన్నాయుడు నిలదీశారు.

Advertisement

Next Story