తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనుల హక్కులు కాపాడుతాం : మంత్రి సత్యవతి

by Shyam |
తెలుగు రాష్ట్రాల్లోని గిరిజనుల హక్కులు కాపాడుతాం : మంత్రి సత్యవతి
X

దిశ, వరంగల్: గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను వంద శాతం గిరిజనులతోనే భర్తీ చేసేలా జారీ చేసిన జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంపై తెలుగు రాష్ట్రాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారని, వారి హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్‌లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ నాయక్‌లతో కలిసి నందన గార్డెన్స్‌లో కరోనా వ్యాప్తి నియంత్రణకు శానిటైజర్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జీవో నెంబర్ 3పై గిరిజనులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పోరాటం చేస్తామన్నారు. సుప్రీం తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి రివ్యూ పిటిషన్ వేయబోతున్నట్టు వెల్లడించారు. అందుకు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను నియమించుకుని, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామన్నారు.గిరిజనులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వలస కూలీలున్నారని, వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను ఇక్కడకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వివరించారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టర్, అధికారులతో వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించే అంశంపై మంత్రి సమీక్ష చేశారు. జిల్లాలో దాదాపు 10వేల మంది వలస కూలీలున్నారని, వారందరిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా వివరాలు సేకరించి, బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చాలన్నారు.

tags : we protect, tribal rights, minister satyavathi rathod, go no 3, ap and telangana state

Advertisement

Next Story

Most Viewed