ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. ముగింపు సభపై టెన్షన్

by srinivas |   ( Updated:2021-12-14 05:57:48.0  )
Padhayathra1
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతులు, మహిళలు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని ఉండాలని.. అది అమరావతియే కావాలని ఆకాంక్షిస్తూ అమరావతి రైతులు, మహిళలు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నవంబర్ 1న గుంటూరులో మెుదలైన ఈ మహాపాదయాత్ర మంగళవారం శ్రీవారి చెంత ముగిసింది. తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం ప్రారంభ స్థలం వద్ద అమరావతి రైతులు, మహిళలు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారి నామస్మరణ చేస్తూ తమ పాదయాత్ర ముగిసినట్లు ప్రకటించారు. శ్రీవారి ఆశీస్సులతో తమ పాదయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిందని అమరావతి జేఏసీ ప్రకటించింది. పాదయాత్ర సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన రైతులు, వివిధ సంఘాలు, పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు మార్చుకుని అమరావతినే రాజధానిగా ప్రకటించాలని అమరావతి జేఏసీ నేతలు కోరారు. పాదయాత్ర ముగియడంతో బుధవారం తిరుమల శ్రీవారిని అమరావతి రైతులు దర్శించుకుంటారు. ఈనెల 17న తిరుపతి బహిరంగ సభతో పూర్తిగా పాదయాత్ర ముగిసినట్లవుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ ముగింపు సభకు అనుమతి కోసం రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. రైతుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ముగింపు సభకు అనుమతి ఇచ్చే అంశంపై క్లారిటీ రానుంది. ఇకపోతే నవంబర్ 1న అమరావతి రైతుల మహా పాదయాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమైంది. 44వ రోజైన మంగళవారం శ్రీవారి చెంత ముగిసింది.

Advertisement

Next Story