అన్నికోణాల్లో ఆలోచించి టికెట్ల కేటాయింపు

by Shyam |
అన్నికోణాల్లో ఆలోచించి టికెట్ల కేటాయింపు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ ఉందని, అయితే సామాజిక న్యాయం, ఉద్యమకారులు సీనియర్లను దృష్టిలో పెట్టుకొని బి.ఫామ్ లు అందిస్తున్నామని మంత్రి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న18 మంది అభ్యర్థులకు ఆయా నియోజవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ బీఫారంలు అంద‌జేశారు. అనంత‌రం మంత్రి ద‌యాక‌ర్‌రావు విలేఖ‌రుల‌తో మాట్లాడారు.

టీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ ఉందని, అయితే సామాజిక న్యాయం, ఉద్యమకారులు సీనియర్లను దృష్టిలో పెట్టుకొని బీఫారంలు అందిస్తున్నట్లు తెలిపారు. టిక్కెట్ రానివారికి సముచితమైన స్థానం క‌ల్పిస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ వచ్చిన అభ్యర్థులు, రాని వారిని కలుపుకొని వెళ్లాలని, పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. టికెట్లు రాని నేతలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ సమన్వయ కమిటీ ముందు చెప్పాలని, బహిరంగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగర వేస్తామని, 66 మందిని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని చెప్పారు.

వరంగల్‌కు బీజేపీ, కాంగ్రెస్ ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌ని అన్నారు. అన్ని కులాలకు, సీనియర్లు, ఉద్యమ కారులకు న్యాయం చేసే విధంగా టికెట్లు కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి స‌త్యవ‌తిరాథోడ్ మాట్లాడుతూ గత ఏడేళ్లలో వరంగల్ లో జరిగిన అభివృద్ధి తెలంగాణ రాకముందు 70 ఏళ్లలో జరగలేదని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు వేరే పార్టీలు దరిదాపుల్లో కూడా లేవని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ గెలిచే పార్టీ కావడంతో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, పార్టీ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ బోంతు రామ్మోహన్ సమన్వయ కమిటీ సభ్యులుగా, బాధ్యులుగా పాల్గొన్నారు.

Advertisement

Next Story